తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ పరిస్థితులు రోజురోజుకూ మారిపోతున్న విషయం తెలిసిందే. అయితే జయలలిత మరణించిన కొన్ని క్షణాల్లోనే ముఖ్యమంత్రి పదవిలో పన్నీర్ సెల్వం కూర్చున్నాడు. ఇది అలా ఉంచితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఎవరిని ఉంచాలన్ని దానిపై అన్నాడీఎంకేలో చీలికల పర్వం కొనసాగింది. రెండుగా చీలిన ఆ పార్టీ నేతల్లో ఒక వర్గంవారేమో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిని చేయాలని, మరో వర్గంవారైతే శశికళను వ్యతిరేకించడం జరిగింది. ఇలా పార్టీ నేతలంతా రెండు వర్గాలుగా చీలి ఈ మధ్య తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళనాడులో పార్టీనేతలంతా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీంతో అందరూ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళనే తీర్మాణించడం జరిగింది.
కాగా పార్టీలో పెద్దమనిషిగా అన్నీతానై చూసుకుంటున్న మధుసూదన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు నేతలంతా నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్వసభ్య సమావేశం ప్రారంభానికి ముందు నేతలంతా జయలలితకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అందుకు సంబంధించి అన్నాడీఎంకే పార్టీ అధికారిక వెబ్ సైట్ లో ఈ విషయాన్ని పార్టీ ప్రకటించింది. అంతే కాకుండా తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ప్రకటించేశాడు. అయితే జనవరి 2వ తేదీన శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఈ సర్వసభ్య సమావేశంలో మరో కొన్ని తీర్మాణాలను కూడా ఆమోదించారు. అవేంటంటే..,. జయలలితకు భారతరత్న ఇవ్వాలనీ, జయలలిత జన్మదినం రోజు జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని, ఇంకా జయలలితకు మెగసెసే అవార్డు, నోబెల్ శాంతి బహుమతులకు ఆమె పేరును ప్రతిపాదించాలని పార్టీ నేతలంతా నిర్ణయం తీసుకున్నారు.