హాస్యాన్ని పండించే హీరోలైన రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, సీనియర్ నరేష్ వంటి వారి తర్వాత తన కామెడీ టైమింగ్‌తో మంచి ప్రతిభ చూపి, మినిమం గ్యారంటీ హీరోగా ఎదిగి, ఎందరికో నవ్వులను వడ్డించిన హీరో అల్లరినరేష్. అతి తక్కువ సమయంలో 50 చిత్రాలను పూర్తి చేసుకున్న ఆయనకు గత చాలా కాలంగా సరైన చిత్రం రావడంలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కెరీర్ చాలా వెనుకబడి ఉంది. డిసెంబర్30న విడుదల కానున్న 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం' చిత్రం ఆయన కెరీర్‌కి కీలకచిత్రంగా చెప్పవచ్చు. ఇలా ప్రస్తుతం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటూ, మూస పేరడీ చిత్రాలు చేస్తూ, కథల ఎంపికలో తడబడుతున్న నరేష్ ముందుగా తనకు జన్మనిచ్చిన నటనపై దృష్టిపెట్టకుండా, దర్శకత్వం చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఆయన దర్శకత్వం వహించే చిత్రం కథ, నటీనటులు, నిర్మాత.. ఇలా ఏవీ ఫైనలైజ్ కాకపోయినా తను దర్శకత్వం వహించే చిత్రం 2020 మే నెలలో విడుదలవుతుందని ప్రకటించాడు.
ఇంతకీ 2020నే ఎందుకు ఎన్నుకున్నారంటే దానికి ఆ సంవత్సరం సౌండింగ్ తనకు భలే నచ్చిందనే వింత సమాధానం ఇచ్చాడు. మరో వంక తనకు మేనెల బాగా అచ్చివచ్చిందని, అందుకే మేనెలలో తాను దర్శకత్వం వహించే చిత్రం రానుందని స్టేట్‌మెంట్ పడేశాడు. ఆయన తండ్రి స్వర్గీయ ఇవివి సత్యనారాయణ తన చిన్నకొడుకైన నరేష్‌ను దర్శకునిగా చేయాలని భావించిన మాట వాస్తవమే. హీరోని చేయాలని భావించిన తన పెద్ద కుమారుడు ఆర్యన్‌రాజేష్ నటునిగా నిలదొక్కుకోకపోయినా, తన చిన్నకొడుకు అల్లరోడు ఆ పనిని పూర్తి చేసినందుకే ఆయన చాలా గర్వపడ్డారు. తానే దర్శకునిగా నరేష్‌కు పెద్ద హిట్ ఇవ్వలేకపోయినా, తన సొంత ప్రతిభతో, కథల ఎంపికతో హీరోగా ఎదిగిన నరేష్‌ను చూసి పొంగిపోయాడు. కానీ తన తండ్రి కోరికను తీర్చాలని భావించి, నటునిగా ఎదుగుతున్న అల్లరోడిని చూసి ఇవివి గర్వపడ్డ అంశాన్ని గాలికొదిలేసి, దర్శకత్వం చేస్తానని ప్రకటించడం ఆయన తప్పిదంగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.