వర్మ తీసిన 'వంగవీటి' చిత్రంపై వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ విషయంలో కాపు నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా వంగవీటి రంగా అభిమానులు పీకల దాకా కోపంతో ఉన్నారు. రంగా కుమారుడు రాధా వర్మకు వార్నింగ్‌లు ఇస్తుంటే, వర్మ కూడా ఏ మాత్రం తగ్గకుండా రాధాతో బస్తీమే సవాల్ అంటున్నాడు. రాధా వర్మకు బుద్ది చెబుతానంటుంటే, వర్మ మాత్రం ఇక్కడ ఎవ్వరూ గాజులు తొడుక్కొనిలేరు. మీ బెదిరింపులు నా దగ్గరకాదు. కావాలంటే రంగా గురించి, ఆయన భార్య గురించి ఎన్నో వాస్తవాలు, ఆధారాలు నాదగ్గర ఉన్నాయి. కానీ రంగా మీద ఉన్న గౌరవంతో అవ్వన్నీ చూపించలేదు. రంగాను గాంధీలా చూపించాలా? లేక మథర్‌దెరిస్సా, గౌతమ బుద్దుడిలా చూపించాలా? అంటూ సెటైర్లు విసురుతున్నాడు.
దీంతో ఈ చిత్రానికి మరింత ప్రీ పబ్లిసిటీ వస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ గురించి చెప్పుకోవాలంటే, 'జీనియస్, రామ్‌లీలా' వంటి చిన్న చిత్రాల నిర్మాత అతను, కానీ వర్మ ఆయనను 'వంగవీటి' చిత్రానికి నిర్మాతగా అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ చిత్రం ద్వారా ఆయనకు పెద్ద పబ్లిసిటీ ఇచ్చాడు. ఈ చిత్రం విడుదలకు ముందు తన గురించి, తన చిత్రం గురించి విపరీతమైన చర్చ జరగడంతో ఆయన ఎంతో సంతోషపడ్డారు. దీనికి తోడు వర్మ వంటి దర్శకుడు ఈ చిత్రాన్ని దాసరి కిరణ్‌కుమార్ నిర్మించడం వల్లే ఇంత బాగా వచ్చిందని, ఆయనే లేకపోతే ఈ చిత్రం విడుదల కూడా అయ్యేది కాదంటూ నిర్మాతకు కితాబునివ్వడంతో నిర్మాత క్రేజ్ అమాంతం పెరిగిపోయి, రాత్రికి రాత్రి ఆయన మీడియాలో ప్రముఖంగా కనిపించి, హాట్ టాపిక్‌గా మారాడు.
కానీ కాపు వర్గీయుడు అయిన దాసరి కిరణ్‌కుమార్ ఇలాంటి చిత్రం తీసి, తన సొంత సామాజికవర్గాన్ని అవమానించడంపై వివాదం ముదురుతోంది. ఈ చిత్రం విషయంలో దాసరికి పలు బెదిరింపు ఫోన్‌కాల్స్, వార్నింగ్‌లు రావడం వల్ల ఆయన ప్రస్తుతానికి భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ఫిల్మ్‌నగర్ అంతర్గత వర్గాల సమాచారం. సినిమా విడుదలైన తర్వాత ప్రమోషన్ విషయంలో దర్శకుడి కంటే నిర్మాతే ఎక్కువ యాక్టివ్‌గా ఉండాలి. కానీ దాసరి మాత్రం ప్రస్తుతానికి ఎవ్వరికీ అందుబాటులో లేడు. అన్నీ అజ్ఞాతం నుండే నడిపిస్తున్నాడు. కాగా వర్మ 'వంగవీటి' చిత్రాన్ని అనౌన్స్ చేసి, దాసరిని నిర్మాతగా ఎంచుకున్న తర్వాత వంగవీటి రంగా -రాధా మిత్రమండలి నాయకులు ముందుగానే నిర్మాతను కలిసి ఈ చిత్రంలో రంగా జీవితంలోని పలు అంశాలను చూపించవద్దని దాసరికి ముందుగానే వార్నింగ్ ఇచ్చారట.
ఈ సందర్భంగా నిర్మాత దాసరి వారికి కొన్ని హామీలను ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ వర్మ మాత్రం ఈ చిత్రాన్ని తాననుకున్నట్లే తీశాడు. కాగా ఈ చిత్రం ఫైనల్ అవుట్‌పుట్‌ను సినిమా విడుదలకు ముందు వర్మ నిర్మాతకు చూపించలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఈ వార్తలను మెజార్టీ టాలీవుడ్ వర్గాలు ఖండిస్తున్నాయి. నిర్మాతలకు ఎంతో విలువ ఇచ్చే వర్మ అలా భయపడే వ్యక్తి కాదని, ఈ చిత్రం రిలీజ్‌కు ముందు చిత్రం అవుట్‌పుట్‌ను నిర్మాతకు చూపించి, అందులోని కొన్ని సీన్స్ విషయంలో నిర్మాతను కన్విన్స్ చేశాడనేది వాస్తవం అంటున్నారు. చాలా తక్కువ పెట్టుబడితో నిర్మించిన 'వంగవీటి' చిత్రాన్ని దాసరి మంచిరేట్లకు అమ్ముకుని ఈ చిత్రం ద్వారా భారీ లాభాలను పొందాడని సమాచారం. త్వరలో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగాక ఆయన మీడియా ముందుకు వచ్చి సినిమాను సినిమాగా చూడాలనే విజ్ఞప్తిని చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని తెలుస్తోంది.