నందమూరి కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు అన్నదమ్ములన్న సంగతి తెలిసిందే. కాగా హరికృష్ణ కుమారులైన ఈ ఇద్దరు కొద్దికాలం కిందట తమ అన్నయ్య అయిన జానకీరాం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎంతో కలత చెందారు.తమ కుటుంబంలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన ఏ ఇంట్లో జరగకూడదనే తలంపుతో ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ చిత్రాల ప్రదర్శన సమయంలో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రేక్షకులకు హెచ్చరికలు తెలియజేస్తూ తమవంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తమ అన్నయ్య జానకీరాం మృతి తర్వాత ఆయన కుమారులైన తారకరామారావు, సౌమిత్ర ప్రభాకర్‌ల ఆలనాపాలనా వీరిద్దరే చూసుకుంటూ వారిని పెద్ద వారిని చేస్తున్నారు.
తాజాగా ఈ పిల్లలిద్దరికి పంచెకట్టు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా వేళాంగిలో ఉంటున్న పిల్లల తాత యార్లగడ్డ ప్రభాకర్ ఇంట్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హరికృష్ణతో పాటు కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌లు కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకలో స్వర్గీయ జానకీరామ్‌ను తలుచుకొని హరికృష్ణ, కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో సహా కుటుంబసభ్యులందరూ ఉద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. కాగా ఈ వేడుకకు యంగ్‌టైగర్‌తో పాటు కళ్యాణ్‌రామ్, హరికృష్ణ తదితరులంతా హాజరయ్యారని తెలుసుకున్న నందమూరి అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అభిమానులతో ఎన్టీఆర్ ఫొటోలు దిగి అందరినీ సంతోషపరిచారు. ఈ వేడుక అనంతరం షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ హైదరాబాద్‌కు తరలిపోగా, కళ్యాణ్‌రామ్, హరికృష్ణ, ఇతర కుటుంబసభ్యులు మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈ వేడుక సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగిందని తెలుస్తోంది. జూనియర్‌కు తన తాతయ్య, బాబాయ్‌ల వలే పురాణాలపై, మన సాంప్రదాయాలపై మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పంచెకట్లు వేడుక సందర్భంగా కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌ల మధ్య ఈ వేడుక జరగాల్సిన పద్దతి, సాంప్రదాయాలపై చర్చ జరిగింది. దీంతో ఎన్టీఆర్‌కు ఈ సాంప్రదాయాలపై ఉన్న పట్టు చూసి, చివరకు అన్న కళ్యాణ్‌రామ్ తమ్ముడు ఎన్టీఆర్‌కు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి, 'నీతో కష్టంరా... బాబూ... నీతో మాట్లాడటం అంత ఈజీకాదు... నన్నొదిలేయ్' అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిని రేపిందని సమాచారం.