చాలా ఏళ్ల కిందట రామోజీరావు నిర్మాతగా, ఉషాకిరణ్ మూవీస్ బేనర్‌లో నూతనప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన 'కారుదిద్దిన కాపురం' చిత్రం అప్పట్లో ఓ వినూత్న కథాంశంతో తెరకెక్కింది. ఓ ఆత్మ కారులోకి ప్రవేశించి, ఓ కాపురాన్ని సరిదిద్దినవైనంగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో చిన్నపిల్లలనే కాదు.. పెద్దలను కూడా బాగా మెప్పించి, మంచి విజయం సాధించింది. కాగా చాలాకాలం తర్వాత ఇప్పుడు అన్ని భాషల్లోనూ హర్రర్, థ్రిల్లర్, కామెడీని మిక్స్ చేసిన చిత్రాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా కోలీవుడ్‌లో ఏళ్ల కొద్ది రారాణిలా వెలిగిపోతున్న స్టార్ హీరోయిన్ నయనతార కూడా ప్రస్తుతం ఈ తరహా కథాంశాలను, లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తోంది.
ఇటీవలే ఆమె 'మాయ'గా వచ్చి అందరినీ మెప్పించింది. ప్రస్తుతం ఆమె మరో హర్రర్ థ్రిల్లర్ 'డోరా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ దెయ్యం ఉంటుందని స్పష్టమవుతోంది. కొందరు నయనతారానే దెయ్యంగా నటిస్తోందని అంటున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని కోలీవుడ్ సమాచారం. ఇందులో నయనతార వాడుకొనే కారును దెయ్యంపడుతుందని, అందులో ఆమె ప్రయాణించేటప్పుడు జరిగే ఆసక్తికర సన్నివేశాలు, అసలు ఆ కారుని దెయ్యం ఎందుకు పట్టింది? ఆ దెయ్యం ఎవరు? వంటి ఆసక్తికర,వినూత్నమైన సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రూపొందుతుందని కోలీవుడ్ విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఫిబ్రవరిలో తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.