కొన్ని కొన్ని నిర్మాణ సంస్థలు తమకంటూ ప్రేక్షకుల్లో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకొని అందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి బేనర్ నుండి చిత్రం వస్తుందంటే ఇక దర్శకులతో, నటీనటులతో సంబంధం లేకుండా ఓ మంచి చిత్రం వస్తుందనే అందరూ ఆశిస్తారు. జయాపజయాలకు అతీతంగా ఆ బేనర్స్ తమకున్న గుడ్‌విల్‌కు తగ్గ అభిరుచిగల చిత్రాలను మాత్రమే నిర్మిస్తుంటాయి. అలా ఆయా బేనర్ల అధినేతలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవలికాలంలో తెలుగులో రామానాయుడు, సురేష్‌బాబు, రామోజీరావు, ఏడిద నాగేశ్వరరావు, మురారి, కె.యస్.రామారావు.. నేడు దిల్‌రాజు, సాయికొర్రపాటి.. ఇలా చాలామందిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
కాగా బాలీవుడ్‌లో అలాంటి మేటి నిర్మాణ సంస్థల్లో ఒకటి యష్‌రాజ్ ఫిలింస్ సంస్థ. ఈ సంస్థ నుంచి ఎన్నో మంచి చిత్రాలు, బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ఇక ప్రస్తుతం దీని అధినేతగా ఉన్న ఆదిత్యచోప్రా విషయానికి వస్తే ఆయన మంచి నిర్మాతే కాదు.. దర్శకుడు కూడా. అలాంటి సంస్థ నుంచి ఇటీవల రణవీర్‌కపూర్, వాణికపూర్‌లు జంటగా 'బేఫికర్ అనే హద్దుమీరిన సెక్స్ కంటెంట్‌తో, బ్లూఫిల్మ్ లాంటి చిత్రం రావడం ప్రేక్షకులనే కాదు.. విశ్లేషకులను, ఆ సంస్థ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి స్వయంగా ఆదిత్యాచోప్రానే దర్శకత్వం వహించాడు. నేటి యూత్ ట్రెండ్‌ను అనుసరించి వచ్చిన చిత్రం అని ఆయన విమర్శల నుండి తప్పించుకోవాలని చూశారు.
కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా తిప్పికొట్టారు. దీంతో డబ్బుల కోసం, హిట్ కోసం ఇలాంటి చిత్రం తీయడం ద్వారా ఆయన తన సంస్థకున్న మంచిపేరును ఒకే ఒక్క చిత్రంతో గంగపాలు చేశాడు. గతంలో దర్శకుడు మారుతిని నమ్మి, ఆయన భాగస్వామ్యంలో ఈ తరహా చిత్రాలనే తీసి దిల్‌రాజు, కె.యస్.రామారావు వంటి అభిరుచిగల నిర్మాతలు కూడా తమ పరువును పోగొట్టుకున్నారు. సినిమా అనేది కేవలం వినోదం కోసమే కాదు.. అంతకు మించిన సామాజిక బాధ్యత దానికుందని, అదో పవర్‌ఫుల్ ఆయుధమన్న సంగతిని మరిచిపోయి ఇలా ఒకటి రెండు చిత్రాలతో ఎన్నోఏళ్లుగా అందరి మదిలో చిరస్థాయిగా నిలిచిన సంస్థల అధినేతలు ఆనాలోచితంగా ఇలాంటి తప్పిదాలు చేయడాన్ని ప్రేక్షకులు తిప్పికొడుతూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా జరిగిన పొరపాట్లను తెలుసుకొని, అలాంటి నిర్మాతలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ముఖ్యం.