యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మన స్టార్ హీరోల సినిమాలు స్టార్ట్ కావడమే ఆలస్యం ఇక ఆ సినిమాకు సంబంధించిన సర్వ విషయాలపైనా అభిమానులు తెగ ఊహించేసుకుంటుంటారు. అది సహజమనుకో. అభిమానం అలాంటిది మరి. అయితే ప్రతి సినిమాకు చిత్రబృందం ఊరింపులతో పాటు, అభిమానుల ఊహాగానాలకు కూడా అంతు ఉండదు. ఎన్టీఆర్, బాబి కాంబినేషన్ తో మూవీ అలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఆ సినిమా టైటిల్ పై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాలాన్ని బట్టి ట్రెండ్ కు తగినట్లుగా కూడా టైటిల్ ను అభిమానులే సెలక్టు చేసేందుకు సర్వం సమాయత్తం చేస్తున్నారు. కాస్త పెద్ద హీరో, గొప్ప డైరక్టర్, మరికొంచెం భారీ బడ్జెట్ చిత్రం అయితే చాలు రకరకాల టైటిల్స్ బయటకు రావడం పరిపాటిగా వస్తుంది. డైరెక్టర్స్ కొన్ని చిత్రాలకు అంటే.. గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి వాటికి ముందే టైటిల్ ను చెప్పేస్తారు. అలాంటి వాటికి అస్సలు గొడవ ఉండదు. ఇంకా చిరంజీవి 150వ చిత్రానికైతే చాలా టైటిల్స్ వినిపించాయి. ఇక మహేష్-మురుగదాస్ చిత్రమైతే చెప్పనే అక్కరలేదు. ఇంకా వారి కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి టైటిల్ ఏంటన్నది డిసైడ్ కాలేదు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తారని, ముగ్గురు ఎన్టీఆర్‌లకు తోడుగా ముగ్గురు నాయికలు ఉంటారని ఇంకా బోనస్ గా చెప్పాలంటే... ఒక హాట్ హాట్ ఐటెం సాంగ్‌లో నాలుగో ముద్దుగుమ్మ కూడా దుమ్మురేపేలా కనిపించనుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ హల్ చల్ చేస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రానికి గాను ‘నట విశ్వరూప’ అనే టైటిల్ ను ఎంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కన్ఫామ్ అవుతుందో లేక దీని ప్లేస్ లో ఇంకా ఇలాంటి కొత్త కొత్త టైటిల్స్ తో ఎన్ని వినాలో వేచి చూద్దాం.