'అష్టా చమ్మా' చిత్రంతో ప్రేక్షకులకు నూతన శైలి హాస్యాన్ని తన పాత్రతో పంచిన నటుడు అవసరాల శ్రీనివాస్.. తరువాత పలు చిత్రాలలో ఆ తరహా పాత్రలలో హాస్యం పండిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడు. వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి ఇచ్చిన సదావకాశాన్ని సద్వినియోగ పరచుకుని 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగానూ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఆ చిత్ర విజయం తరువాత తనపై ఏర్పడ్డ అంచనాలను అందుకోవటం కోసం స్క్రిప్ట్ పకడ్బందీ గా తయారు చేసుకోవటానికి ఎంతో శ్రమించి అనూహ్య విరామం తరువాత తిరిగి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం 'జ్యో అచ్యుతానంద'. ఈ చిత్రం కూడా అవసరాల శ్రీనివాస్ ప్రతిభ ని మరొకసారి ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ఈ విజయం తరువాత అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం హంటర్ కి రీమేక్ వెర్షన్ ఐన 'బాబు బాగా బిజీ' చిత్రీకరణలో బిజీ అయిపోయాడు అవసరాల. దర్శకుడిగా తన తదుపరి చిత్రం నాచురల్ స్టార్ నాని తో ఉండబోతుంది అని ప్రకటించిన శ్రీనివాస్ అవసరాల ఆ చిత్రాన్ని వెల్లడించక ముందే హీరోగా మరో చిత్రానికి సైన్ చేసేసాడు. తాను దర్శకత్వం వహించిన 'జ్యో అచ్యుతానంద' చిత్రంలో ఒక ముఖ్య భూమికను పోషించిన కథానాయిక రెజీనా.. శ్రీనివాస్ అవసరాల సరసన కథానాయికగా నటించనుంది. విజయ్ అనే దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రం జనవరిలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అవసరాల నటిస్తున్న 'బాబు బాగా బిజీ' చిత్రంలో కూడా తొలుత రెజీనా పేరును పరిశీలనలో పెట్టినప్పటికీ ఆ అవకాశం మిస్తీ చక్రవర్తిని వరించిన సంగతి తెలిసిందే.