త్రేతా యుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన చరిత్ర తిరగేస్తే అనేక విధాలుగా జంతువులను, మనుషులను బలివ్వటాన్ని ఆచారంగా పాటించిన దాఖలాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అయితే కలియుగానికి వచ్చే సరికి కాలం మారి కేవలం జంతువులను మాత్రమే బలి ఇస్తున్నవారు ఎందరు వున్నారో జంతు బలిని కూడా మూఢ విశ్వాసంగా భావించే వారు అదే సంఖ్య లో వుంటారు. ఇటువంటి నర బలి నేపథ్యంలో కృష్ణ వంశి గతంలో తెరకెక్కించిన డేంజర్ లో ఆయన ఈ అంశాన్ని చూచాయగానే ప్రస్తావించారు తప్ప పూర్తి స్థాయిలో నర బలుల చుట్టూ కథను నడపలేదు. ఇప్పుడు శ్రీ రాజ్ అనే దర్శకుడు ఆ ప్రయత్నం చేస్తున్నారు.
అవును చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక పూర్ణ గత నెలలో విడుదలైన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంతో మంచి నటి గానూ నిరూపించుకుంది. ఇప్పుడు పూర్ణ కు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్ర అవకాశం దక్కింది. పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీ రాజ్ దర్శకత్వంలో రాబోతున్న అవంతిక చిత్రంలో టైటిల్ రోల్ లో కనిపించనుంది పూర్ణ. మానవాతీత శక్తులు పొందుతామని నమ్మకంతో నర బలికి సిద్దపడే అవంతిక పాత్రలో నటిస్తుంది పూర్ణ. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో పలు హావభావాలతో పూర్ణ ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు ఈ కథకు హారర్ టచ్ మోతాదు మించి ఇచ్చినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే హారర్ చిత్రాలకు విసుగు చెందిన ప్రేక్షకులు వరుసగా వస్తున్న ఆ జోనర్ చిత్రాలను తిరస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి మరి.