మోదీ కరెన్సీపై తీసుకున్న నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పలు రంగాలపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఈ ఎఫెక్ట్ బాగా పడింది. కానీ టాలీవుడ్‌లో మాత్రం 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రం మంచి విజయం సాధించింది. ఇక రామ్‌చరణ్ 'ధృవ' చిత్రం కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. కోలీవుడ్‌లో కూడా ఒకటి రెండు చిత్రాలు పెద్ద విజయాలను నమోదు చేశాయి. కానీ ఈ ఎఫెక్ట్ నుంచి బాలీవుడ్ పరిశ్రమ మాత్రం ఇంకా కోలుకోలేదు. నవంబర్ 8 నుండి ఇప్పటివరకు అక్కడ దాదాపు అరడజను పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి.
అయినా ఒక్క చిత్రం కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలవలేదు. కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్, అలియాభట్‌లు నటించగా గౌరీషిండే దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ జిందగీ' చిత్రం మాత్రమే ఓకే అనిపించుకుంది. ఈచిత్రానికి కూడా షారుఖ్ స్థాయిలో కలెక్షన్లు రాలేదు. కేవలం 70కోట్ల దగ్గరే ఈ చిత్రం ఆగిపోయింది. అయినా లోబడ్జెట్‌లో తెరకెక్కించిన చిత్రం కావడంతో హిట్ అనిపించుకుంది. 'కహాని2, బేఫికర్, రాక్‌ఆన్2' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం బిటౌన్ ఆశలన్నీ డిసెంబర్ 23న విడుదల కానున్న అమీర్‌ఖాన్ 'దంగల్' చిత్రంపైనే ఉన్నాయి. మరి అప్పటికైనా పరిస్థితులు చక్కబడతాయో? లేదో? అనే సందేహం బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలను వెంటాడుతోంది.