సూపర్‌స్టార్ కృష్ణ తనయునిగా మొదట ఆయన పెద్ద కుమారుడు రమేష్ సినీ రంగ ప్రవేశం చేసి, పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత చిన్ననాటి నుండి బాలనటునిగా చేస్తూ వస్తున్న మహేష్‌బాబు ఆయనకు మరో వారసునిగా పరిచయమై సంచలనాలు సృష్టిస్తూ తండ్రికి తగ్గ తనయునిగా, నేటితరం సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకొని టాలీవుడ్‌లో స్టార్‌గా వెలిగిపోతున్నాడు. కృష్ణ కుమార్తె మంజుల కూడా కొన్ని చిత్రాలలో నటించి మెప్పించి, ఆ తర్వాత నటనను పక్కనపెట్టింది.
ఇక సుధీర్‌బాబు కూడా ఆ ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫర్వాలేదనిపించుకుంటున్నాడు. కాగా మహేష్‌కు తన సోదరి భర్త, తన బావ అయిన గల్లా జయదేవ్ అంటే చాలా గౌరవం. తనకు ఆయనే నిజజీవితంలో స్ఫూర్తిని అని స్వయంగా మహేష్ ఆమధ్య చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం వ్యాపారవేత్తగా, గుంటూరు టిడిపి ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ఎప్పటి నుంచో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. అందుకోసం ఆయన నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిల్లో అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో ఆయన హీరోగా తెరంగేట్రం చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి.
ఆయన ఎంట్రీ చిత్రం కోసం ఇప్పటికే ఆయన తండ్రి గల్లా జయదేవ్ పలు కథలను వింటున్నాడని సమాచారం. ఈ విషయంలో ఆయన తన బావమరిది మహేష్ సలహాలను కూడా తీసుకుంటున్నాడు. మరి గల్లా అశోక్ ఎంట్రీ చిత్రాన్ని ఆయన తండ్రే స్వయంగా నిర్మిస్తాడా? లేక ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన నిర్మాణ సంస్ధల ద్వారా ఎంట్రీ ఇస్తాడా? అనేది ఇంకా తేలలేదు. మరోపక్క గల్లా అశోక్ కోసం తనకున్న ఫాలోయింగ్‌ను పణ్ణంగా పెట్టాలని మహేష్ సైతం ఓ నిర్ణయానికి వచ్చాడంటున్నారు.
దీంతో మహేష్‌కున్న క్రేజ్ ఈ యువహీరోకు బాగా ఉపయోగపడుతుందనే భావించాలి. మరో విశేషం ఏమిటంటే.... గల్లాఅశోక్ ఇంకా తెరంగేట్రం చేయకముందు కొందరు మహేష్ అభిమానులు 'గల్లా యువసైన్యం' పేరుతో ఇప్పటికే అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయడంపై సినీ వారసుల రాకలు ఎక్కువకావడాన్ని నిరసించేవారు దీనిపై విమర్శలు మొదలుపెట్టారు.