సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రియసఖి శశికళ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలని భావించి, దానికి 'శశికళ' అనే టైటిల్‌ను కూడా రిజిష్టర్ చేశాడు. కాగా ఈ చిత్రం ప్రకటించి మరోసారి వర్మ వార్తల్లో నిలిచాడు. దేశవ్యాప్తంగా ఈ వార్త పెను సంచలనం సృష్టించింది. కానీ కొందరు విశ్లేషకులు మాత్రం వర్మ ఇలా కావాలని ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి, సంచలనం కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని, దాదాపు శశికళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నందున ఆమెను చెడ్డగా చూపించి, ఆయన ఆమెకు శతృవు కాలేడని వ్యాఖ్యానిస్తున్నారు.
దీనికి ఉదాహరణగా వారు దివంగత సమైఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయన తర్వాత 'రెడ్డి గారు పోయారు' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశాడని, అలాగే రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు కూడా 'ఆంధ్రా సీఎం కిడ్నాప్'ను ప్రకటించాడని, అలాగే ఓ పొలిటికల్ స్టోరీగా ఆయన జయలతిత బతికి ఉన్నప్పుడు ఆమెపై సెటైరిక్‌గా 'అమ్మ' అనే టైటిల్‌ను రిజిష్టర్ చేశాడని, కానీ జయలలిత ముఖ్యమంత్రి కావడం వల్ల, రాజశేఖర్‌రెడ్డిని సెటైరిక్‌గా తీస్తే ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అలాగే కేసీఆర్, చంద్రబాబులను విమర్శిస్తూ 'ఆంధ్రా సీఎం కిడ్నాప్' చిత్రం చేస్తే వేధింపులు తప్పవనే ఉద్దేశ్యంతో ఆయన మరలా ఆ చిత్రాల ఊసే ఎత్తలేదని, కాబట్టి 'శశికళ' చిత్రాన్ని కూడా ఆయన తెరకెక్కించే ప్రసక్తే లేదంటున్నారు.
తాజాగా కొందరు నెటిజన్లు జయలలితగా విలక్షణ నటి రమ్యకృష్ణ అయితేనే ఆమె పాత్రకు న్యాయం చేకూరుస్తుందని భావించి, ఆమెతో ఓ పోస్టర్‌ను డిజైన్ చేశారు. 'మదర్' అనే టైటిల్‌ను, 'ది స్టోరీ ఆఫ్ ఎ క్వీన్' అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ పోస్టర్ హల్‌చల్ చేస్తోంది. కాగా కొందరు ఈ విషయాన్ని రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించగా, తనకు ఇంత వరకు డ్రీమ్‌రోల్ అనేది లేదని, కానీ జయలలిత పాత్రను చేయాలనే కోరిక ఇప్పుడు తనకు డ్రీమ్‌గా మారిందని, తనలాంటి ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చిన ఆమె జీవిత చరిత్రను ఎవరైనా తీయడానికి ముందుకు వస్తే తాను ఆ పాత్ర చేయడానికి సిద్దంగా ఉన్నానని అఫీషియల్‌గా ప్రకటించింది.