గత కొంతకాలంగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం స్టార్ హీరో సూర్య ఎదురుతెన్నులు చూస్తున్నాడు. ఈ వెర్సటైల్ ఆర్టిస్ట్ తాజాగా తనకు మాస్ స్టార్‌గా తమిళ, తెలుగు భాషల్లో క్రేజ్ తెచ్చిపెట్టిన హరి దర్శకత్వంలో చేస్తున్న 'ఎస్3' చిత్రంపై ఎన్నో నమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. తనకు గతంలో 'సింగం, సింగం2' (తెలుగులో 'యముడు, సింగం2') వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, తనను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతంగా ఆవిష్కరించిన హరి దర్శకత్వంలోనే ప్రస్తుతం అదే సిరీస్‌లో భాగంగా 'ఎస్3' చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సౌత్‌ఇండియన్ టాప్ హీరోయిన్స్ అనుష్క, శృతిహాసన్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని మొదట దీపావళికి విడుదల చేయాలని భావించారు. దీపావళికి తన సోదరుడు కార్తి హీరోగా నటించిన 'కాష్మోరా' చిత్రం విడుదల కానుండటంతో వాయిదా వేశారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 16న విడుదల చేయనున్నామని ప్రకటించారు. కానీ రామ్‌చరణ్ 'ధృవ' కోసం మరోసారి ఓ వారం వాయిదా వేసి, ఈనెల 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ కరెన్సీ కష్టాలు ఇంకా తీరకపోవడం, తమిళనాడులో అమ్మ జయలలిత మరణ శోకం నుండి ఇంకా తమిళులు కోలుకోకపోవడం, ఇటీవల వచ్చిన వార్దా తుపాన్ వల్ల తమిళనాడులోని చాలా ప్రాంతాలు అతలాకుతలం కావడంతో ఈ తేదీన కూడా ఈచిత్రం విడుదల కావడం లేదు. తమ చేతిలో లేని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం విడుదలను వాయిదా వేశామని సూర్య చెప్పుకొచ్చాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి26న రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయినా ఈ చిత్రం వాయిదా తమ మంచికేనని భావిస్తున్నట్లు యూనిట్ చెప్పుకొంటోంది. మరి జనవరి 26న అయినా ఈ చిత్రం విడుదలవుతుందో లేదోచూడాలి. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో సూర్య అభిమానులు నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఆదిలోనే హంసపాదులు ఎదుర్కొంటున్న ఈ చిత్రం వాయిదాల ప్రభావం సినిమా ఫలితం మీద పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.