తమిళ స్టార్ ధనుష్‌కు దేశవ్యాప్తంగా మంచి నటునిగా పేరుంది. కాగా ఆయన కోలీవుడ్‌లోనే గాక బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించాడు. మరోపక్క గత రెండేళ్లుగా ధనుష్‌కు పెద్ద బ్లాక్‌బస్టర్ లేదు. ఆయనకు వచ్చిన చివరి అతి పెద్ద విజయం 2014లో వచ్చిన 'విఐపి' నే. ఈ చిత్రం తెలుగులో కూడా 'రఘువరన్‌బి.టెక్'గా విడుదలై తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు గుర్తింపునిచ్చింది.
కాగా ప్రస్తుతం అన్ని భాషల్లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. తమ విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తూ, మొదటి చిత్రం ద్వారా వచ్చిన క్రేజ్‌ను బాగా వాడుకొంటున్నారు. తాజాగా ధనుష్ కూడా అదే దారిలో నడుస్తూ, తన 'విఐపి' చిత్రానికి సీక్వెల్‌గా 'విఐపి2'ను మొదలుపెట్టాడు. ఇప్పటికే నటునిగా, గాయకునిగా తన సత్తా చాటుకున్న ధనుష్ 'విఐపి2'కు కథ, స్క్రీన్‌ప్లే కూడా అందిస్తున్నాడు. ఆల్‌రెడీ ప్రస్తుతం ఆయన తమిళ క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజ్‌కిరణ్‌తో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ధనుష్ సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అల్లుడైనప్పటికీ ఇప్పటివరకు స్వయంకృషితో ఎదుగుతూ వచ్చాడే గానీ తన మామ క్రేజ్‌ను పెద్దగా వాడుకోలేదు. ప్రస్తుతం రజనీ కూడా అనారోగ్యం కారణంగా, మరోవైపు 'రోబో2' చిత్రం షూటింగ్ బిజీ వల్ల ఇతర ఫంక్షన్స్‌కు పెద్దగా హాజరుకావడం లేదు. కానీ ఆయన ధనుష్ నటిస్తున్న 'విఐపి2'కి ముఖ్య అతిధిగా విచ్చేసి చిత్రానికి తొలిక్లాప్‌నిచ్చి, సినిమాకు ప్రారంభంలోనే మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. వాస్తవానికి రజనీ ప్రస్తుతం 'రోబో2' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కానీ ఇటీవల తమిళనాడును మరీ ముఖ్యంగా చెన్నైను అతలాకుతలం చేసిన వార్ధా తుఫాన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌కు కాస్త బ్రేక్ వచ్చింది.
ఈ చిత్రం కోసం చెన్నైలో ఓ ఫిలింసిటీలో భారీ సెట్టింగ్ వేశారు. ఇందులో కొంత బాగం సెట్‌ను ఓపెన్ ప్లేస్‌లో కూడా వేశారు. అయితే తుఫాన్ వల్ల వచ్చిన వర్షం, విపరీతమైన వేగంతో వీచిన గాలులకు ఈ సెట్టింగ్‌లో కొంతభాగం పాడయింది. దీంతో ఈ చిత్రానికి ఓ మూడురోజుల గ్యాప్ వచ్చింది. దాన్ని ధనుష్ బాగానే క్యాష్ చేసుకొని, తన మామను ఉపయోగించుకున్నాడు. కాగా ఈ చిత్రం మొదటి పార్ట్‌కు వేల్‌రాజ్ దర్శకత్వం వహించాడు. కానీ ఈ సీక్వెల్‌ను ధనుష్, నిర్మాత థానులు రజనీ చిన్నకూతురు, ధనుష్ మరదలు అయిన సౌందర్యరజనీకాంత్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇప్పటికే 'కొచ్చాడియన్' ద్వారా తన తండ్రిని నిలువునా ముంచిన ఆమె తన బావకు హిట్ ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.