మెగాస్టార్ చిరంజీవి తన బావమరిది, గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాటకు బాగా విలువ ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే చిరు ప్రతి అడుగు వెనుక అల్లు సలహా ఉంటుందనేది వాస్తవం. అల్లు చెప్పుడు మాటలు విని చిరు తనకు కెరీర్ ప్రారంభంలో ఎంతో సహాయం చేసిన స్నేహితులైన కమెడియన్ సుధాకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ప్రసాద్‌బాబు, హరిప్రసాద్ వంటి వారిని కూడా దూరంగా పెట్టాడని, ఆయన అల్లు చెప్పుడు మాటలనే వింటారనే విమర్శ కూడా ఉంది. చిరు రాజకీయ అరంగేట్రం నుంచి, పిఆర్‌పీ పార్టీ స్థాపన, ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు, చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే వరకు ప్రతి చర్య వెనుక అల్లు హస్తమే ఉందని ఫిల్మ్‌నగర్ వాసులు బహిరంగంగానే చెప్పుకుంటూ ఉంటారు.
చివరకు తన సోదరులైన పవన్, నాగబాబుల కంటే చిరు అరవింద్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని, చిరుపై పవన్‌కి ఉన్న బాధకు కూడా ఇదే కారణం అంటూ ఉంటారు. ఇక చిరు ప్రస్తుతం రాజకీయాలలో యాక్టివ్‌గాలేడు. దాంతో ఆయన ఇక వరుస సినిమాలు చేస్తానని కూడా చెప్పాడు. ఇప్పటికే ఆయన దాదాపు దశాబ్దం తర్వాత మరలా రీఎంట్రీ ఇస్తూ, తన 150వ చిత్రంగా 'ఖైదీనెంబర్150' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమైపోతోంది. అదే సమయంలో చిరు నటించే 151వ చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేస్తానని ఆల్‌రెడీ అల్లుఅరవింద్ క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ చిత్రం కోసం మొదట అల్లు తన కుమారుడు బన్నీకి 'సరైనోడు' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటికి స్టోరీ తయారు చేయమని కూడా చెప్పాడు.
కానీ ప్రస్తుతం బోయపాటి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వడానికి, ఆ తర్వాత చిరు స్టోరీపై బోయపాటి దృష్టి పెట్టడానికి చాలా సమయంలో పట్టే అవకాశం ఉండటంతో అల్లు దృష్టి సురేందర్‌రెడ్డిపై పడింది. ఆల్‌రెడీ చిరు, సూరిలు త్వరలో తమ కాంబినేషన్‌లో ఓ చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కానీ చాలామంది బోయపాటి చిత్రం తర్వాత సూరి చిత్రం ఉంటుందనుకున్నారు. చిరు కూడా 'ఖైదీనెంబర్150'కి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి తన తదుపరి చిత్రాన్ని డిసైడ్ చేయడానికి కొంత గ్యాప్ తీసుకోవాలనే భావించాడు. కానీ అల్లు మాత్రం 'ఖైదీ' చిత్రం విడుదలైన అతి కొద్ది గ్యాప్‌లోనే చిరుతో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. 'ధృవ' సమయంలో తమ బేనర్‌లో సూరిని మరో చిత్రం చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. సో... 'ఖైదీ' చిత్రం మంచి రిజల్ట్‌ను సాధిస్తే దాన్ని వెంటనే క్యాష్ చేసుకొంటూ సూరి-చిరుల చిత్రాన్ని ప్రారంభించాలని అల్లు భావిస్తున్నాడు. అదే ఈ చిత్రం విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం అల్లు ఆచితూచి అడుగువేస్తాడే కానీ తొందరపడడు.. అనేది ఆయన మాస్టర్ మైండ్ తెలిసిన వారు అంటున్నారు. సో.. మొత్తానికి ప్రస్తుతం బోయపాటి వెనక్కు వెళ్లగా సూరి ఈ రేసులో ముందుకొచ్చాడని చెప్పవచ్చు.