బాలయ్య దేవుళ్లు, జాతకాలు, మంచి ముహూర్తాలు.. ఇలా ప్రతి అంశాన్ని ఖచ్చితంగా ఫాలోఅవుతాడు. పెద్దలు, జ్యోతిష పండితులు చెప్పే పనులు ఎంత క్లిష్టమైనా పాటిస్తాడు. తాజాగా ఆయన నటిస్తున్న వందోచిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ఆడియోను తన తండ్రికి పెద్ద సెంటిమెంట్ అయిన తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఈనెల 16 వతేదీ సాయంత్రం విడుదల చేయడానికి సన్నద్ధమౌతున్నా సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు వేడుకకు ముఖ్యఅతిథులుగా హాజరవుతారని భావిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులకు ఆ రోజు పలు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయని, దాంతో ఈ వేడుక వాయిదా పడవచ్చని వార్తలు వచ్చాయి. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా బాలయ్య పట్టుబట్టి అదే ముహూర్తాన తన వేడుకను ఖరారు చేశారు. ఆ రోజున ఆయన గురుపండితుల సూచనపై ఉదయం కరీంనగర్‌లోని కోటిలింగాల దేవస్దానంలో ఈ చిత్రం స్పెషల్ ట్రైలర్‌ను ఆవిష్కరించి, అనంతరం కోటీశ్వర సిద్దేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆడియో వేడుక కోసం తిరుపతికి బయలుదేరుతాడని సమాచారం. అలాగే ఆడియో వేడుక జరిగే ముందే పండితుల సలహాపై సాయంత్రం 5గంటలకు ఈ చిత్రం ట్రైలర్‌ను రెండు తెలుగు రాష్ట్రాలలోని 100 థియేటర్లలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రాన్ని బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.