రజనీ చిత్రాలు విడుదలతో పాటు ఆయన పుట్టినరోజు కూడా తమిళ ప్రజలకు, ముఖ్యంగా ఆయన అభిమానులకు ఓ పండుగ రోజులాంటిది. వాటిని ఆయన అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కాగా గత ఏడాది చెన్నైలో వరదల కారణంగా రజనీ తన పుట్టినరోజును జరుపుకోలేదు. తాజాగా తమిళనాడు సీఎంగా చేస్తూ తుదిశ్వాస విడిచిన అమ్మ జయలలిత జ్ఞాపకాలలోనే ఇప్పటికీ తమిళ ప్రజలు శోకసంద్రంలో ఉన్నారు. దీంతో పాటు ఆమె మరిణించిన తర్వాత వారం రోజులపాటు తమిళనాడు ప్రభుత్వం సంతాపదినాలను ప్రకటించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న రజనీ ఈ ఏడాది తన పుట్టినరోజైన డిసెంబర్ 12న వేడుకలు జరపవద్దని, బ్యానర్లు, ఫెక్ల్సీలు కట్టవద్దని ఓ లేఖ ద్వారా తన అభిమానులను కోరారు. చాలా రోజుల తర్వాత ఇటీవల విడుదలైన రజనీ 'కబాలి' చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది. తెలుగులో తప్ప అన్ని భాషల్లో మంచి విజయం సాధించడంతో తమిళనాడులోని రజనీ అభిమానులు ఈ ఏడాది ఆయన జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నారు. వారు రజనీ చేసిన విజ్ఞప్తితో కాస్త నిరుత్సాహానికి లోనవుతున్నారు. కాగా జయలలిత పార్దీవ దేహం చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టిన తమ అభిమాన హీరో బాధను గుర్తించిన ఆయన అభిమానులు ఆయన ఆజ్ఞను శిరసావహించడానికే నిర్ణయించుకున్నారు.