Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫాన్స్ పై కోట...ఆవేదన..!


స్వర్గీయ ఎన్టీఆర్‌ సినిమాలలో ఉన్నప్పుడే కాదు... ఆయన రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయనకు ధీటుగా నిలబడిన ఒకే ఒక్కడు సూపర్‌స్టార్‌ కృష్ణ, ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన తన చిత్రాలలో ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలను పెట్టి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ఆయన గట్స్‌ అభినందనీయం. కాగా ఆయన నిర్మించిన లేదా ఆయన ప్రోత్సహంతో ఎన్టీఆర్‌పై పలు సెటైరిక్‌ చిత్రాలు వచ్చి, సంచలనం సృష్టించాయి. వాటిల్లో 'మండలాధీశుడు' ఒకటి. అందులో ఎన్టీఆర్‌ను పోలిన వ్యంగ్యమైన పాత్రను ది గ్రేట్‌ కోటశ్రీనివాసరావు పోషించి, అద్భుతంగా నటించాడు. ఆయన నటనకు ప్రేక్షకులు జైజైలు కొట్టారు. కానీ ఈచిత్రంతో ఆయన ఎన్టీఆర్‌ అభిమానులకు బద్ద శత్రువుగా మారిపోయాడు. ఆయనపై పలుసార్లు దాడులు కూడా జరిగాయి. ఈవిషయాలను ఇటీవల కోట ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టి తన ఆవేదన వెల్లడంచారు. 'మండలాధీశుడు' చిత్రంలో మంచి క్యారెక్టర్‌ వస్తే నటునిగా దానికి న్యాయం చేశాను. కానీ ఆయన అభిమానులు మాత్రం తట్టుకోలేకపోయారు. అందరూ నన్ను నానా తిట్లు తిట్టారు. దాంతో ఈ అడ్డమైన వారితో మాటలు పడేకంటే ఎన్టీఆర్‌ గారి దగ్గరకే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ నా స్నేహితులు కొందరు ఆ పని చేయవద్దు. ఆయనకు చాలా కోపం. ఆయన కాదు... ఆయన పక్కనుండే వారే నిన్ను అక్కడే చంపేస్తారని చెప్పినా నేను తెగించి ఆయన వద్దకు వెళ్లి నమస్కరించాను. ఆయన నన్ను ఎగాదిగా చూసి ఆ తర్వాత గుర్తుపట్టి, నాతో.. విన్నాను బ్రదర్‌.. మంచి నటులవుతారు. ఆరోగ్యం ముఖ్యం. కీప్‌ గుడ్‌ హెల్త్‌' అన్నారు. వెంటనే ఆయన కాళ్లకు నమస్కరించి వచ్చేశాను. ఎన్టీఆర్‌ అభిమానులే కాదు... మా బెజవాడ ఎమ్మెల్యే నెహ్రూ కూడా ఒకసారి నేను కనిపిస్తే... బలసిందా? ఆయనను కించపరుస్తావా? చంపేయాలనుంది. జాగ్రత్తగా చిత్రాలు చేసుకో. మొదటి సారి కాబట్టి వదిలేస్తున్నా.. అన్నారు. ఏ అండ లేని నాకు ఆంత పెద్ద ఎన్టీఆర్‌తో వైరం ఎందుకు అనేంతగా ఆలోచించారు. కాగా ఓ రోజు నేను హైదరాబాద్‌ నుంచి బెజవాడ స్టేషన్‌లో రైలు దిగాను. అదే సమయంలో ఎన్టీఆర్‌ గారు బెజవాడ నుంచి హైదరాబాద్‌కు ట్రైన్‌లో వెళ్తున్నారు. స్టేషన్‌ నిండా ఆయన అభిమానులు, తెలుగుదేశం జెండాలతో నిండిపోయి ఉంది. దీంతో జాగ్రత్తగా వారు గుర్తుపట్టకుండా స్టేషన్‌ నుంచి బయటకు వెళ్ళాలనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్ది కొందరి దృష్టిలో పడ్డాను. వారంతా అలర్ట్‌ అయి, నన్ను దిగ్బంధం చేసి, స్టేషన్‌ వెనుకకు లాక్కెళ్లి తలా ఒక చేయి వేసి కొట్టారు. ఒక్కరు కూడా కళాకారునిగా ఆయన తప్పేంలేదని ఆలోచించలేదు. దాంతో చాలా అవమానం వేసింది. నా తప్పే ఉంది... అని బాధపడ్డాను. ఆ తర్వాత చాలాకాలానికి త్రివిక్రమరావ్‌ నిర్మాతగా 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' చిత్రంలో ఓ మంచి పాత్ర వేశాను. ఈ విషయంలో త్రివిక్రమరావుగారిని మర్చిపోలేను. 'మండలాధీశుడు' చిత్రం తర్వాత మరలా నేను నందమూరి హీరోతో కలిసి నటించడం అదే మొదటి సారి.. అంటూ తన ఆవేదనను , బాధను ఉద్వేగంగా చెప్పుకొచ్చారు కోట. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs