స్వర్గీయ తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్యదైవం, వారు 'అమ్మ' గా పిలుచుకునే పురచ్చితలైవి జయలలిత తెలుగులో కూడా పలు చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కాగా జయ సూపర్‌స్టార్ కృష్ణ సరసన 'గూఢచారి 116', 'నిలువుదోపిడి' చిత్రాలలో నటించింది. ఇక కృష్ణ స్వయంగా ఎన్టీఆర్‌తో కలసి నటించి, నిర్మించిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో ఆమె ఎన్టీఆర్‌కు జోడీగా నటించింది. కాగా ఆమె కృష్ణతో నటించిన 'గూఢచారి 116' చిత్రం తెలుగులో జయకు మంచి మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. కాగా కృష్ణకు జయలలితతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన పెద్ద కూతురు పద్మావతి పెళ్లి చెన్నైలో జరుపుతున్నప్పుడు జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నారు. కృష్ణ కూడా ఆమెను కలిసి తన కుమార్తె వివాహానికి రమ్మని ఆహ్వానించాడు. అందుకు జయ కూడా సమ్మతించారు. కానీ మూడురోజుల తర్వాత ఆమె సెక్యూరిటీ అధికారి కృష్ణను కలిసి భద్రతా కారణాల రీత్యా మండపంలోని మొదటి మూడులైన్లను జయకు, ఆమె సెక్యూరిటీ సిబ్బందికి కేటాయించాలని షరత్తు విధించారట. దాంతో కృష్ణ అది సరికాదని భావించాడు. కారణం ఏమిటంటే... ఆ వివాహానికి ఎందరో రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు అన్ని భాషల నుండి విచ్చేస్తున్నారు. మొదటి మూడు లైన్లను జయకు కేటాయిస్తే, ఇతర రాజకీయ ప్రముఖుల, సినీ ప్రముఖుల మనసులు నొచ్చుకుంటాయని భావించిన కృష్ణ ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటికీ జయను కలిసి తన సమస్యను వివరించి, ఆ వివాహానికి ఆమెను రావద్దని ఆమెకు నేరుగా చెప్పాడు. దానికి ఆమె నవ్వుతూ అలాగే అని చెప్పి, ఆ వివాహానికి తనను రావద్దని చెప్పినా కూడా అభిమానంతో ఆ వివాహానికి ఓ బొకే పంపిందట. ఈ విషయాన్ని ఇటీవల సూపర్‌స్టార్ కృష్ణనే స్వయంగా చెప్పుకొచ్చారు. ముక్కుసూటితనం అంటే మరి కృష్ణదే అని ఈ విషయం తెలిసిన వారెవ్వరైనా ఒప్పుకుంటారు.