కొన్నేళ్ల కిందట ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమాతో వచ్చి అభిమానులను కూడా 'అతిథి'గా పలకరించేవాడు మహేష్‌బాబు. కానీ ప్రస్తుతం ఆయన దూకుడంటే ఏమిటో చూపిస్తున్నాడు. ఒక చిత్రం సెట్స్‌పై ఉండగానే మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే కాదు.. ఏకంగా వాటి టైటిల్స్‌తో పాటు విడుదల తేదీలను కూడా కన్‌ఫర్మ్ చేసేంతగా ఆయన విజృంభిస్తున్నాడు. దీంతో ఆయన అభిమానులే కాదు.. ఇలాంటి దూకుడు అందరిలో ఉండాలనే ప్రశంసలను కూడా ఆయన అందుకుంటున్నాడు. ప్రస్తుతం మురుగదాస్‌తో చేస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్‌ళో ఆయన బిజీగా ఉన్నాడు. గుజరాత్‌లోని గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఆయనకు, విలన్ ఎస్.జె.సూర్యకు మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లను రాత్రి వేళల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈషెడ్యూల్ ఈనెల 24తో పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయన ఓ పదిరోజులు ఫ్యామిలీతో విదేశీ టూర్ ప్లాన్ చేశాడు. కాగా ఈ చిత్రం టైటిల్, లోగోలు జనవరి 1న, ఫస్ట్‌లుక్ జనవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా 'భరత్ అనే నేను' చిత్రం చేయనున్న సంగతి కూడా విదితమే. ప్రమాణ స్వీకారాలలో వాడే పదం కావడంతో ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే స్టోరీ అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కాగా తన 'జనతాగ్యారేజ్' చిత్రాన్ని కేవలం ఐదునెలల్లో పూర్తి చేసిన కొరటాల అదే ఊపుతో ఈ తాజా చిత్రాన్ని కూడా చేయనున్నాడు. మార్చిలో మొదలు పెట్టి వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 22న పండుగకు పదిరోజుల ముందే మహేష్‌తో సందడి చేయించనున్నాడని సమాచారం. మొత్తానికి మహేష్ దూకుడు చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేయకమానదు.