జయలలిత అనారోగ్యంతో అపోలో హాస్పటల్ లో చేరింది మొదలు తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. అమ్మ కనుసన్నల్లోనే రాజకీయ పాలన కొనసాగుతున్నా.. ప్రతిపక్షాలు మాత్రం చేతులు కట్టుకుని కూర్చోకుండా తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య విషయాలు బట్టబయలు చెయ్యాలని చూసింది. అయినా జయలలిత తర్వాత రాజకీయ వారసుడిని ప్రకటించమని ప్రభుత్వం పై ఒత్తిడి కూడా తెచ్చింది ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే. అయితే జయలలితకి వారసులుగా ఇప్పటిదాకా ముగ్గురు పేర్లు ప్రచారంలోకొచ్చాయి. వారిలో ఒకరు జయలలిత స్నేహితురాలు శశికళ కాగా మరొకరు జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వం. ఇకపోతే అసలు రాజకీయాలు అంటే ఏమాత్రం అవగాహన లేని మరో వ్యక్తి పేరు కూడా జయ వారసుడిగా హల్ చల్ చేసింది. అదే సినీ నటుడు తలా అజిత్ పేరు.
అసలు అజిత్ పేరు తమిళ రాజకీయాల్లోకి ఎందుకొచ్చిందో ఎవరికీ అంతుపట్టలేదు. అజిత్తే..జయ రాజకీయ వారసుడని మీడియాలో కూడా ప్రచారం జరిగింది. అయితే చాలామందికి అజిత్ పేరు బయటకెలా వచ్చిందో అర్ధం గాక తలలు పట్టుకుంటే... మరికొందరు జయలలితకు అజిత్ అత్యంత సన్నిహితుడని అందుకే ఆపేరుని కూడా ప్రచారం చేశారని చెబుతున్నారు.
ఒక పక్క మీడియాలో అజిత్ పేరు మోత మోగుతూనే వుంది మరోపక్క జయలలిత గత సోమవారం రాత్రి కన్ను మూయడంతో జయ వారసుడిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆగమేఘాల మీద జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. అయినా అజిత్ పేరు, శశికళ పేరును మీడియా వదిలి పెట్టలేదు. ఇదంతా ఒక ఎత్తైయితే అమ్మని కడసారి చూడడానికి సినీరంగ ప్రముఖులు, సామాన్య జనాలు హాజరవుతుంటే ఆ జనంలో ఎక్కడా అజిత్ గాని.. అతని ఫ్యామిలీ కానీ కనబడలేదు. ఇదే తమిళనాట చర్చనీయాంశమైంది. మరి అజిత్ ఎందుకు రాలేదో అని అందరూ తెగ ఇదైపోతున్న టైములో అజిత్ ఒక్కసారిగా బుధవారం తెల్లవారు జామున మెరీనా బీచ్ సమీపంలో అమ్మ సమాధి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అజిత్ అమ్మ సమాధి దగ్గరికి తన ఫ్యామిలీతో కలిసొచ్చి నివాళులర్పించారు. అయితే అజిత్ ఇంత ఆలస్యం గా రావడానికి కారణం.. అమ్మ అస్తమించిన సమయం లో అజిత్ చెన్నైలో లేకపోవడమేనట.
అజిత్ తన ‘తలా 57’ సినిమా షూటింగ్ కోసం బల్గెరియాలో ఉండడం వల్ల అమ్మ ఆఖరి చూపు దక్కలేదని అందుకే సమాధి దగ్గర నివాళులర్పించాడని వచ్చాడని చెబుతున్నారు. బల్గెరియా నుండి బయలుదేరి చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగి నేరుగా అమ్మ సమాధి వద్దకు వెళ్లిపోయారు అజిత్ మరియు షామిలి. ఇక అజిత్.. జయ సమాధిని దర్శించుకున్న అనంతరం మరో తమిళ ప్రముఖుడు చో రామస్వామి మరణవార్త విన్న ఆయన రామస్వామికి కూడా నివాళులర్పించేందుకు అపోలో హాస్పటల్ కి వెళ్లారు. ఏదిఏమైనా అజిత్ అంటే జయలలితకు వాత్సల్యం ఉన్నమాట నిజమని చాలామంది వాదిస్తున్నారు.