నారా రోహిత్.. ఈ పేరులోనే ఏదో తేడా ఉంది. ఆయన తన మొదటిచిత్రం 'బాణం' నుండి వరుసపెట్టి ఎవ్వరూ చేయని డిఫరెంట్ సబ్జెక్ట్‌లను చేస్తూ వస్తున్నాడు. దీంతో ఆయన కొంతవరకు ప్రేక్షకుల్లో విభిన్నచిత్రాల హీరోగా మంచి పేరే తెచ్చుకున్నాడు. ఏడాదికి ఐదారు చిత్రాలు చేసే ఆయన నటించిన పలు చిత్రాలు ఈ ఏడాది ఇప్పటికే విడుదలయ్యాయి. కానీ ఆయనకు కమర్షియల్‌గా ఎంతో కొంత పేరు తీసుకొచ్చిన చిత్రాలు మాత్రం 'సోలో, జ్యో అచ్చుతానంద' అనే చెప్పాలి. తాజాగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన 'జ్యో అచ్యుతానంద' ఆయనకు పెద్ద వెలుగును ఇవ్వకపోయినా కాస్త దారి మాత్రం చూపించే వెలుగునిచ్చింది. ఈ ఉత్సాహంతో ఆయన తాజాగా నటించిన మరో విభిన్న చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు' విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. 'అయ్యారే' చిత్రం ద్వారా తనలోని వైవిధ్యాన్ని చాటుకున్న సాగర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మరో హీరోగా శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో నారా రోహిత్‌ది పోలీస్ ఆఫీసర్ పాత్ర అన్నట్లు ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. ఈ మూవీకి నారా రోహిత్ సమర్పకునిగా కూడా వ్యవహరిస్తుండటంతో ఈ చిత్రంపై కాస్త ఆశలు పెంచుకుంటున్నారు విభిన్నచిత్రాలను మెచ్చే ప్రేక్షకులు. మరి 'జ్యోఅచ్యుతానంద'ఇచ్చిన చిన్న బ్రేక్‌ను ఆయన ఎలా వాడుకోనున్నాడు? అనేది వేచిచూడాల్సివుంది.