ప్రముఖ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ టేకింగులో కానీ, మేకింగులో కానీ పూర్తిగా వైవిధ్యం ఉట్టిపడుతుంది. తెలుగు సినిమాల్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరీని మించిన దర్శకుడు లేడనే చెప్పాలి. అలాగే పూరి జగన్నాథ్ సినిమాలకు పెట్టే టైటిల్స్ కూడా భిన్న వైవిధ్యాన్ని సంతరించుకుంటాయి. కొత్తదనంతో పాటు చమత్కార భరితంగానూ ఉంటాయి. చాలా సున్నితమైన కథాంశాలతో పాటు పూరి చిత్రాలలో కవిత్వం పుష్కలంగా తాండవిస్తుంది. అలాగే పూరి చిత్రాలకు సంబంధించిన సెటైర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అమ్మా, నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం వంటి పొయెటిక్ టైటిల్స్ లనే కాకుండా పూరి జగన్నాథ్, ఇడియట్, పోకిరి వంటి తిట్టుపూర్వకమైన మాటలను కూడా తన సినిమాలకు టైటిల్స్ గా పెట్టాడు. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ ఈసారి సరికొత్త కథతో వెరైటీ టైటిల్ ని ఎంచుకున్నాడు. అదేంటంటే..‘మూడు కోతులు, ఒక మేక’. తాజాగా పూరి జగన్నాథ్ తన సొంత సంస్థ అయిన వైష్టో అకాడమీ పేరు మీద మూడు కోతులు, ఒక మేక అనే టైటిల్‌ని రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకుడుగా ఇజం సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అందరూ భావించారు కానీ అది పట్టాలెక్కిన దాఖలాలు లేవు. ఇజం దారణమైన పరాభవాన్ని చవిచూడటంతో పూరి వద్దకు ఏ స్టార్ హీరో కూడా రావడం లేదు.
ఇజం సినిమా తెచ్చిన షాక్ తో పూరి జగన్నాథ్ కొత్తవాళ్లతో సినిమా చేయాలని గట్టిగానే తీర్మానించుకున్నాడు. ఇందుకోసం తాను తీయబోయే చిత్రానికి మూడు కోతులు, ఒక మేక అనే టైటిల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసమని పూరి ముగ్గురు హీరోల్ని వెదికే పనిలో పడినట్లుగా కూడా పరిశ్రమ వర్గాల టాక్ నడుస్తుంది. వీరిలో నాగశౌర్య, నిఖిల్ వంటి వర్థమాన హీరోలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త కథాకథనంతో పూరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంతో పూరి సక్సెస్ సాధిస్తే పూరి ఈజ్ బ్యాక్ కావడం ఖాయం.