సోలోహీరోగా కాకపోయినా, అతిధి పాత్రలు, స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ తెలుగులోనే కాక తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో రానా దగ్గుబాటి. కాగా ఆయనకు 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్ కంటే ఎక్కువ పేరు కూడా వచ్చిందనేది వాస్తవం. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా ఆయనకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రంలో నటిస్తూ, ఆ చిత్రంపై బోలేడు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన సోలో హీరోగా నటించిన మరో చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. యుద్దనేపథ్యంలో హిందీ, తెలుగు భాషల్లో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న 'ఘాజీ' చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ తాప్సి కూడా ఓ ప్రధానపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారతీయ చరిత్రలో తొలి నావికాదళ యుద్దనేపథ్యంలో రూపొందుతున్న ఈ 'ఘాజీ' చిత్రంపై రానా చాలా ఆశలే పెట్టుకుని ఉన్నాడు. ఈ చిత్రాన్ని పివిపి సంస్దతో కలిసి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌సంస్థ నిర్మిస్తుండగా సంకల్ప్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. మొదట ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న తేదీ కంటే ఈ చిత్రాన్ని ఓ వారం ముందుగానే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. పిబ్రవరి 17న ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలకానుంది. మరి ఈ చిత్రమైనా రానాకు సోలోహీరోగా మంచి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.