మలయాళ సూపర్‌స్టార్, వర్సటైల్ ఆర్టిస్ట్ మోహన్‌లాల్ కల ఎట్టకేలకు ఈ ఏడాది నెరవేరింది. మిగిలిన కొందరు తన కొలీగ్స్‌లాగానే తాను కూడా టాలీవుడ్‌లో క్రేజ్ పెంచుకోవాలని నిర్ణయించున్నప్పటికీ గతంలో కొన్ని హిట్ చిత్రాలు కూడా తెలుగులో సరిగ్గా ఆడకపోవడంతో అప్పుడు ఆయన తెలుగుపై ప్రత్యేక శ్రద్దపెట్టలేదు. కానీ ఎట్టకేలకు ఆయన ఈ ఏడాది టాలీవుడ్‌లో తన సత్తా చాటుకుని, కమర్షియల్‌గా తనతో కలిపి చిత్రాలు చేస్తే తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ క్రేజ్ వస్తుందనే వాస్తవాన్ని నిరూపించాడు. ఆయన ఈ ఏడాది తెలుగులో నటించిన 'మనమంతా', ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ 'జనతాగ్యారేజ్'లతో ఇక్కడ తనదైన శైలి చూపించాడు. దీన్ని మరింత పటిష్టం చేసుకోవడం కోసం మలయాళంలో తానే హీరోగా, జగపతిబాబు విలన్‌గా నటించి ఘనవిజయం సాధించిన పక్కా మాస్, మసాలా చిత్రం 'పులిమురుగన్'ను ఇటీవలే తెలుగులోకి 'మన్యంపులి'గా డబ్ చేసి, విడుదల చేశాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా తెలుగులో మాస్ అండ్ యాక్షన్ చిత్రాల ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా బి,సి సెంటర్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయడంలో సఫలమైంది. దీంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఈ ఏడాది ఓనం పండుగకు మలయాళంలో విడుదలైన తాను నటించిన వైవిధ్యభరిత చిత్రం 'ఒప్పం'ను డబ్ చేస్తున్నాడు. ఓ అంధుడైన లిఫ్ట్‌బోయ్ కమ్ వాచ్‌మెన్‌గా ఆయన నటించిన ఈ సూపర్ వెరైటీ క్రైం థ్రిల్లర్ మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తమిళంలో కమల్‌హాసన్, హిందీలో అక్షయ్‌కుమార్‌లు రీమేక్ చేయనున్నారు. అదే సమయంలో ఈ చిత్రం కన్నడ, బెంగాళీ వంటి భాషల రీమేక్ రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయాలని కొందరు అగ్రనిర్మాతలు, స్టార్స్ ఆసక్తి చూపించినప్పటికీ మోహన్‌లాల్ మాత్రం ఎవ్వరికీ రీమేక్ రైట్స్ ఇవ్వకుండా తెలుగులో కూడా డబ్బింగే చేయాలని పట్టుబట్టి, ప్రస్తుతం ఆ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. వాస్తవానికి మలయాళ చిత్రాలన్నా, మోహన్‌లాల్ అన్నా వైవిధ్యభరితమైన చిత్రాలే మన ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి. దాంతో తెలుగు ప్రేక్షకులను రొటీన్‌గా నడిచే 'మన్యం పులి' కంటే 'ఒప్పం' చిత్రం బాగా ఆకట్టుకుంటుందని, దాంతో ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనేది మోహన్‌లాల్ ఆలోచనగా తెలుస్తోంది. ఆయన ఈ చిత్రాన్ని తనతో పాటు దిలీప్‌కుమార్ అనే నిర్మాతతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంలో డిసెంబర్30న విడుదల చేసి, ఈ ఏడాదికి ఘన వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలనుకుంటున్నాడు. 'కనుపాప' లేదా 'వాచ్‌మెన్ జైరాం' పేర్లలో ఒకదాన్ని సెలక్ట్ చేసి విడుదల చేయనున్నాడు. కాగా నవంబర్‌లోనే విడుదల కావాల్సివుండి, ఆగిపోయిన అల్లరి నరేష్ నటించిన 'ఇంట్లో దెయ్యం... నాకేం భయం' చిత్రం కూడా అదే తేదీన విడుదలకు సిద్దమవుతోంది. భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా, నాగేశ్వర్‌రెడ్డి వంటి కామెడీ చిత్రాల హిట్ డైరెక్టర్‌తో చేస్తున్న ఈ చిత్రం అల్లరినరేష్‌కు కీలకంగా మారింది. మరి ఈ అల్లరోడి పోటీలో మోహన్‌లాల్ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తాడో వేచిచూడాల్సివుంది.