హీరో నుండి 'లెజెండ్'తో విలన్‌గా, ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతిబాబు కెరీర్ మరలా ఉపందుకుంది. ఆయన
నటించిన చిత్రాలు మంచి విజయాలే సాధిస్తుండటంతో ఆయన కెరీర్ దక్షిణాది భాషల్లో బిజీ బిజీగా మారింది. తమ చిత్రాలకు తెలుగు మార్కెట్ కూడా బాగుండాలని భావించే తమిళ, మలయాళ నిర్మాత, దర్శక, హీరోలకు ఆయన ఒక వరంలా మారాడు. ఆయన తాజాగా మలయాళంలో మోహన్‌లాల్‌కు విలన్‌గా నటించిన 'పులి మురుగన్' చిత్రం డబ్బింగ్ వెర్షన్ 'మన్యం పులి' కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ఈ సందర్భంగా ఆయన తన భవిష్యత్తు నిర్ణయాలపై కూడా మాట్లాడాడు. వీటిపై మాత్రం ఇండస్ట్రీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
ఆయన మాట్లాడిన సంగతులేమంటే... అవకాశాల కోసం నేను ఎవ్వరి వద్దకు వెళ్లి అడగడం లేదు. నన్నే అవకాశాలు వెత్తుక్కుంటూ వస్తున్నాయన్నాడు. డేట్స్ అజెస్ట్ చేయలేక ఈమధ్య రెండు పెద్ద చిత్రాలను వదిలేశానని, ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడలేదన్నాడు. తద్వారా ఆయన చిత్రాల ఎంపికలో తన నిర్ణయాలు సరిగ్గా ఉంటున్నాయని వివరించే ప్రయత్నం చేశాడు. దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు లేవు. ఇక తన తాజా చిత్రాల గురించి చెబుతూ, నాగచైతన్య, గోపీచంద్, సాయిధరమ్‌తేజ్‌లు హీరోలుగా రూపొందుతున్న చిత్రాలలో నటిస్తున్నానని, అలాగే తానే ప్రధానపాత్రలో 'పటేల్ సార్' అనే సినిమాలో నటిస్తున్నానని, 60ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి రివేంజ్ స్టోరీ ఇదని అన్నాడు. వీటితోపాటు నా బయోగ్రఫీ మీద టీవీ సీరియల్ చేస్తున్నానని, వీటితో పాటు సినీ క్లిక్ వెబ్‌సైట్ ఆధ్వర్యంలో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నానన్నాడు. బయట చాలా మంది దగ్గర డబ్బు ఉంది. నిర్మాత కావాలనే ఆలోచన ఉంది. కానీ సినిమాల మీద అవగాహన లేదు. అటువంటి వారికోసం మేము సినిమాలు నిర్మిస్తాం. ఎంత బడ్జెట్ అవుతుందో ముందే చెప్పేస్తాం. ఎక్కువైతే మేమే భరిస్తాం. రిలీజ్ కూడా మేమే చూసుకుంటాం. నిర్మాతలను స్టార్స్ చేయాలనేది నా ఉద్దేశ్యం. గతంలో అలానే ఉండేది. చాలా సింపుల్‌గా సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా చేయడం కష్టమవుతోంది. పాత రోజులు తిరిగి తీసుకురావడమే నా లక్ష్యం' అని తన భవిష్యత్తు ఆశల గురించి చెప్పుకొచ్చాడు. కానీ ఆయన తన తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ జీవితంపై బయోగ్రఫీ తీస్తే చూస్తారేమో గానీ, తన జీవితం గురించి బయోగ్రఫీ తీసేంత గొప్ప చరిత్ర ఆయనకు లేదని, గతంలో నటసమ్రాట్ పేరుతో అక్కినేని వంటి లెజెండ్‌పై టీవీ సీరియల్ తీసినా, దానిని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదని, దాంతో ఆ సీరియల్ అర్థాంతరంగా ఆగిపోయిన విషయాన్ని సినీ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇక బయటి వారి సొమ్ముతో చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్త మాత్రం పెద్ద జోక్‌గా కనిపిస్తోంది. ఆయన తానే హీరోగా తన తండ్రి రాజేంద్రప్రసాద్ వ్యతిరేకించిన కథలను కూడా తన తండ్రిని బలవంతపెట్టి సొంతంగా సినిమాలు తీశాడని, వాటి బడ్జెట్ విషయంలో కూడా అవి లిమిట్ దాటాయని, ఈ విషయంలో ఆయన తండ్రే తన కొడుకు నిర్ణయాలను వ్యతిరేకించాడన్న విషయం అందరికీ తెలిసిందే అంటూ ఆయన భవిష్యత్తు కలలపై పలువురు సెటైర్లు విసురుతున్నారు. మరి జగ్గుభాయ్ కల నెరవేరుతుందో లేదో కాలమే తేల్చిచెప్పాలి.