ప్రభాస్ వయసు 37 దాటుతోంది. తన తోటి హీరోలు, తనకంటే చిన్న వయసు హీరోలు కూడా పెళ్లిళ్లు చేసుకొని, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈయన పెళ్లి విషయంలో ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరిగిందని, అదే సమయంలో ప్రభాస్ కూడా ఇక వివాహం చేసుకొని ఓ ఇంటివాడవ్వడానికి రెడీ అయ్యాడనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కానీ 'బాహుబలి' రెండో పార్ట్ కూడా విడుదలయ్యే దాకా ఓపిక పట్టమని తన కుటుంబసభ్యులకు రిక్వెస్ట్ చేశాడని, దాంతో వారు కూడా ఆయన మాటకు విలువ ఇస్తూ ఈ విషయంలో ఓపికపడుతున్నారంటున్నారు. గతంలోనే ప్రభాస్ పెళ్లి, ఆయన చేసుకోబోయే అమ్మాయి విషయంలో పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా ఖండించాడు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ పెళ్లి విషయంలో మరలా రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రభాస్ చేసుకోబోయేది పెద్దలు నిర్ణయించిన వివాహమేనని, ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులతో పాటు ఆయన కూడా ఓ అమ్మాయిని ఓకే చేశాడనే వార్త బాగా వినిపిస్తోంది. తాజాగా ఆయన ఈ విషయాన్ని తన సన్నిహితులైన స్నేహితుల వద్ద కూడా తెలిపాడంటున్నారు. వైజాగ్‌లో స్దిరపడిన ఓ పారిశ్రామిక వేత్త కూతురిని ప్రభాస్ వివాహం చేసుకోనున్నాడని, ఈ విషయాన్నే ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె అందంతో పాటు, వ్యక్తిత్వం కూడా తనకు బాగా నచ్చిందని, ముఖ్యంగా తన కోసమే ఆమె మూడేళ్లుగా ఎదురుచూస్తూ గడుపుతోందని ఆయన తన స్నేహితులతో అన్నాడంటున్నారు. కానీ అమ్మాయి వివరాలను, ఆమె ఫొటోను కూడా తన ప్రాణ స్నేహితులకు కూడా చూపించకుండా రహస్యం ఉంచాడంటున్నారు. ఆ అమ్మాయి పేరు, వివరాలు ఇప్పుడే వెల్లడైతే అది తమ రెండు కుటుంబాలకు మధ్య బాగా ఇబ్బందులు క్రియేట్ చేస్తుందనే పాయింట్ వల్లనే ఆయన అందరి దగ్గరా ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతున్నాడనే వార్తలు మొదలయ్యాయి. మరి ఇవి నిజమో? కాదో? తెలియాలంటే బాహుబలి 2 రిలీజ్ వరకు ఆగాల్సిందే..!