సాధారణంగా బై వన్.. గెట్ వన్ ఫ్రీ అనేది మనం వ్యాపారాలలో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా ఈ ట్రెండ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో నాగార్జున, బాలకృష్ణలు ముందున్నారు. తమకు హిట్స్ ఇచ్చిన దర్శకులను తమ కాంపౌండ్ దాటనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. నాగార్జున విషయానికి వస్తే తనకు 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చిన కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణను బయటకు పోనివ్వకుండా తన తనయుడు నాగచైతన్యతో సినిమా ఛాన్స్ ఇచ్చి ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇక తమ ఫ్యామిలీ చిత్రంగా 'మనం' వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తన రెండో తనయుడు అక్కినేని అఖిల్ నటించనున్న రెండో చిత్రాన్ని ఆయన నిర్మించనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి అఖిల్ తొలి చిత్రాన్ని నాగ్...విక్రమ్ కె.కుమార్‌తోనే చేయాలని భావించాడు. కానీ మధ్యలో వినాయక్ ఎంటర్ అయ్యాడు. అఖిల్, నితిన్‌ల బలవంతం వల్ల నాగ్ అప్పుడు మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ 'అఖిల్' చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో రెండో చిత్రం విషయంలో అఖిల్ తన తండ్రి చెప్పినట్టే నడుచుకుంటున్నాడు.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన తన తనయుడు మోక్షజ్ఞను త్వరలో హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తనకు 'సింహా, లెజెండ్' వంటి పవర్‌ఫుల్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన కుమారుడిని పరిచయం చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ అంత పెద్ద మాస్ డైరెక్టర్‌తో తన కుమారుడితో మొదటిచిత్రం చేయడం రిస్క్ అని భావించాడట. ఇక తన ప్రతిష్టాత్మకమైన వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ సమయంలో దర్శకుడు క్రిష్ పనితీరు నచ్చి తన కుమారుడు మోక్షజ్ఞను క్రిష్ చేతిలో పెట్టనున్నాడనే వార్తలు వస్తున్నాయి. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సాధించబోయే ఫలితం చూసిన తర్వాత బాలయ్య ఈ విషయాన్ని ఖరారు చేయాలా? వద్దా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వనున్నాడని సమాచారం. ఇలా తండ్రులకు పనిచేసిన దర్శకులే వారి తనయుల చిత్రాలకు కూడా అవకాశాలు పొందుతున్నారు.