ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుమారుడు లోకేష్ పనితీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. పార్టీపరంగా లోకేష్ చురుకుగా పనిచేయడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకనే చంద్రబాబు కుమారుడిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా తాత్సారం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా చంద్రబాబు, లోకేష్ పనితీరుపై తన అసంతృప్తిని వ్యక్తపరచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున ఈ మధ్య సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలెట్టింది. అదీ ఓ యాప్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసే దిశగా ఆ కార్యక్రమాన్ని మొదలెట్టారు. అంతటితో ఆగకుండా తెదేపాలో సభ్యత్వం తీసుకున్నవారికి ప్రత్యేక భీమా సదుపాయం కూడా కల్పించారు. దాంతో ఒక్కసారిగా నెలరోజుల వ్యవధిలోనే.. సుమారు 25 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి రికార్డు సృష్టించినట్లుగా.. ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘనంగా ప్రకటించాడు. అయితే ఈ క్రెడిట్ మొత్తం కూడా చినబాబుకే దక్కాలని, లోకేష్ అనుసరించిన పలు విధానాలతో ప్రజలు బాగా ఆకర్షణకు లోనయ్యారని, అందుకనే సభ్యత్వ నమోదు కార్యక్రమం అద్భుత విజయం సాధించిందని వివరించాడు.
కాగా ఈ విధానంపై తాజాగా చంద్రబాబు నాయుడు తీవ్రంగా అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అదేంటంటే.. పోయిన సంవత్సరంలో 50 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటే ఈ సంవత్సరం కేవలం 37 లక్షల మంది మాత్రమే సభ్యత్వం తీసుకున్నారని, ఈ విషయంలో చంద్రబాబు మండిపడినట్లుగా తెలుస్తుంది. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. మన పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ.. మంత్రులూ, నాయకుల తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపాడు. అంతటితో ఆగకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగించాలని సూచించినట్లు తెలుస్తుంది. మొత్తానికి చినబాబు పెదబాబు వద్ద బాగానే దొరికిపోతున్నాడుగా.