మోదీ తీసుకున్న పాత నోట్ల రద్దు ఎఫెక్ట్ సినీరంగంపై తీవ్రంగా పడింది. బ్లాక్‌మనీ చలామణి ఎక్కువ ఉండే రంగాల్లో సినీ రంగం కూడా ఒకటి. ఇక్కడ నిర్మాతలు పెట్టే ఖర్చు, ఇచ్చే రెమ్యూనరేషన్స్ వంటి వాటిల్లో సగం బ్లాక్‌మనీనే ఉంటుంది. కాగా ఇటీవల ఐటీ శాఖ 'బాహుబలి' వంటి భారీ చిత్రాన్ని తీసి కోట్లు గడించిన నిర్మాతలపై దాడులు జరపడం మన నిర్మాతల్లో గుబులురేపుతోంది. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఐటీ వాళ్లు ఎప్పుడు తమపై దాడి చేస్తారో అని వణికిపోతున్నారు. ఇక మన స్టార్ హీరోలు, హీరోయిన్లే కాదు.. అందరూ ఇప్పుడు తమకు రెమ్యూనరేషన్‌గా వైట్ మనీనే కావాలని పట్టుబడుతున్నారు. హీరో, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్స్ నుండి లైట్‌బోయ్ వరకు కొత్త కరెన్సీనే కావాలని పట్టుబడుతుండటంతో నిర్మాతలు నానా అగచాట్లు పడుతున్నారు. చివరకు పత్రికల్లో, టీవీ చానెళ్లకు ఇచ్చే ప్రకటనల డబ్బును కూడా
వైట్‌గానే ఇవ్వమని ఆయా యాజమాన్యాలు పట్టుబడుతుండటంతో నిర్మాతలు అందరూ వైట్.. వైట్.... అంటుంటే మేమెక్కడి నుండి తేవాలి? సినిమా నిర్మాణం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి. ఎక్కడెక్కడి నుండో డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టాలి. సినిమా రిలీజ్ అయి, ఆ చిత్రం విడుదలయిన చాలా రోజుల తర్వాత కానీ లాభనష్టాల గురించి లెక్కలు తేలవు. మరి సడన్‌గా లెక్కలు చూపాలని ఐటీ అధికారులు దాడులు చేస్తే, మేమెక్కడి నుండి లెక్కలు చూపాలి? అంటూ వాపోతున్నారు. ఈ పరిణామాలతో కొందరు బిజెపి పార్టీలో చేరితే తమకు ఇబ్బందులు, వేధింపులు తగ్గుతాయేమో అనే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దాదాపు పరిశ్రమలోని అందరూ ఇప్పుడు ఆడిటర్లతో కూర్చొని రాత్రింబగళ్లు ఐటీ వారికి లెక్కలు ఎలా చూపి, ఈ దెబ్బ నుంచి ఎలా బయటపడాలా? అని తలలుపట్టుకుని, లెక్కలతో కుస్తీలు పడుతున్నారు.