దక్షిణాదిలో కమల్‌హాసన్, విక్రమ్ వంటి నటులు తమ సినిమాలోని పాత్రల కోసం ఎంతటి కష్టానైన్నా పడతారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలోనే కాదు.. ఆ పాత్రకు తగ్గ శరీరాకృతి, బాడీలాంగ్వేజ్ కోసం రాత్రింబగళ్లు తపించింది పోతుంటారు. ఇక బాలీవుడ్‌లో ఈతరం హీరోలలో ఆ స్థాయిలో కష్టపడే మిష్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా అమీర్‌ఖాన్‌కు కూడా అంత పేరుంది. తాజాగా ఆయన 'దంగల్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన అవుట్‌పుట్ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో అమీర్ ఓ కుర్రాడు అయిన మల్లయోధునిగా, అదే సమయంలో నలుగురు అమ్మాయిల తండ్రిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. బయోపిక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యువకుడైన రెజ్లర్‌గా ఆయన సిక్స్‌ప్యాక్ బాడీలో కండలు తిరిగి కనిపిస్తాడు. ఈ సిక్స్‌ప్యాక్‌ను ఆయన కేవలం మూడునెలల్లోనే సాధించడం విశేషం. ఇక తండ్రిగా ఓల్డ్ గెటప్‌లో కనిపించే ఆయన ఆ పాత్ర కోసం తన బరువును 120 కేజీలకుపెంచి, వయసుగా తగ్గట్లుగా భారీ పొట్ట వేసుకొని కనిపిస్తాడు. వీటి కోసం ఆయన పడిన కష్టాన్ని వీడియోలో చూసిన వారు ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా ఈ చిత్రం తెలుగులోకి కూడా 'యుద్దం' పేరుతో అనువాదమై హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది.