తెలుగు ప్రజలను కేంద్రం ప్రభుత్వం రెండు రాష్ట్రాలుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే ఇరు రాష్ట్రాలలోనూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలలోనూ అసెంబ్లీ సీట్లను పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. కానీ కేంద్రం వీరి అభ్యర్థనను తిరస్కరించింది. లోకసభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని, అది ఇప్పటికిప్పుడు సాధ్యం అయ్యే పని కాదని తెలిపింది.
కాగా అసెంబ్లీ స్థానాలను పెంచాలంటూ ఇరు తెలుగు రాష్ట్రాల నుండి తమకు అభ్యర్థనలు వచ్చాయని, అయితే వాటి సాధ్యాసాధ్యాల విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్నామని, అయితే ఇప్పట్లో ఒక్కసారిగా అసెంబ్లీ స్థానాల పెంపు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అటార్నీ జనరల్ తెలిపిందని హోం శాఖ లిఖిత పూర్వకంగా వివరించింది. అయితే 2026 వరకు పెంపు సాధ్యం కాదని తెలిపిన హోం శాఖ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 సెక్షన్ 26ను సవరిస్తే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమౌతుందని అందులో తెలపడం విశేషం. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షంలోని సభ్యులను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తమ పార్టీలోకి ఆహ్వానించుకున్న విషయం తెలిసిందే. అయితే వారంతా పార్టీలోకి వచ్చేప్పుడు పలు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ విధంగా వారికి ఏదో ఒక పదవి ఇచ్చి ఆ విధంగా సంతృప్తి పరిచే నిమిత్తం అసెంబ్లీ స్థానాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గురిపెట్టి కేంద్రం ద్వారా శాసనసభ సీట్లను పెంచుకోవాలని సూచించింది. కాగా కేంద్రం సూచనతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ఆశలకు భారీగానే గండిపడినట్లయింది.
Advertisement
CJ Advs