తమిళ క్రియేటివ్ జీనియస్ గౌతమ్ వాసుదేవమీనన్ అద్భుతమైన డైరెక్టరే కాదు... తెలివైన దర్శకుడు కూడా. ఎప్పుడు ఎవరితో సినిమాలు చేయాలి? అనే విషయంలోనే కాదు.... ఒకే చిత్రాన్ని రెండు భాషల్లో వేర్వేరు హీరోలతో చేసి, బడ్జెట్ కలిసొచ్చేలా సినిమాలు తీయడంలోనూ ఆయన స్పెషలిస్ట్. అయితే ఆయన చిత్రాలన్నీ లేటవుతుంటాయని, అందువల్ల నిర్మాతలకు సినిమా హిట్టయినా కూడా వడ్డీలు పెరిగి సరైన లాభాలు మిగలవనే విమర్శ కూడా ఆయనపై ఉంది. తాజాగా ఆయన తీసిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం కూడా ఆయనకు పెద్దగా పేరు తీసుకురాలేకపోయింది. దీంతో ఈసారి ఆయన ఓ తెలుగు చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే తెలుగులో అతి చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'పెళ్లిచూపులు' రీమేక్. సాధారణంగా తమిళ, తెలుగుభాషల్లో ద్విభాషా చిత్రాలను నిర్మించే ఆయన ఈసారి తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అయితే ఈ చిత్రాన్ని కూడా ఆయన తమిళంలో ఒకహీరోతో, మలయాళంలో మరో హీరోతో ఒకేసారి రెండు భాషల్లో తీయడం వల్ల బడ్జెట్ పెరుగుతున్న కారణంగా ఈ చిత్రం రీమేక్‌ని తమిళ, మలయాళ భాషల్లో ఒకే హీరోతో తీయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. అందుకే ఆయన మలయాళ యంగ్ హీరో, 'ప్రేమమ్' ఫేమ్ నవీన్‌పౌలీని హీరోగా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడట. సూపర్‌హిట్ 'ప్రేమమ్' ద్వారా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ హీరోకు మలయాళంతో పాటు తమిళంలో కూడా మంచి గుర్తింపే ఉంది. ఇక 'పెళ్లిచూపులు'ను తెలుగులో తీసినట్లుగానే అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అంటే అంత తక్కువ బడ్జెట్‌లో రెండు భాషల్లో ఒకే హీరోతో, అందునా ఆల్‌రెడీ ప్రూవ్‌డ్ మూవీ కావడంతో గౌతమ్‌మీనన్ చాలా తెలివైన నిర్ణయమే తీసుకున్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్ర నిర్మాణంలో ఆయన కూడా భాగస్వామిగా మారాలనే నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే నిర్మాతగా పెద్దగా హిట్స్‌లేని గౌతమ్‌ను ఈ చిత్రం నిర్మాతగా కూడా నిలబెడుతుందనే విశ్వాసాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.