డిసెంబర్9న రామ్‌చరణ్ నటించిన 'ధృవ' చిత్రం విడుదలకు సిద్ధమైంది. చరణ్ తన తదుపరి చిత్రం.. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రిమూవీస్ బేనర్‌లో చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. కాగా కేవలం మాస్‌లో ఇమేజ్ కలిగిన చరణ్‌తో మేథావులను, ఓవర్‌సీస్ ఆడియన్స్‌ను, మల్టిప్లెక్స్ ప్రేక్షకులను మెప్పించే ప్రయోగాత్మక చిత్రాలు చేసే సుకుమార్ చేయబోయే చిత్రం ఏ విధంగా ఉంటుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. వీరిద్దరి కలయిక అందరిలో ఆసక్తిని రేపుతోంది. కాగా ఈ చిత్రం ఏ జోనర్‌కు చెందిన చిత్రం అనే విషయంలో కూడా రోజుకే వార్త వస్తోంది. కాగా ఇది '24, మనం' తరహాలో సాగే టైమ్ పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఎక్కువ భాగం 1980 నాటి కాలంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరులో జరిగే ప్రేమకథగా సాగుతుందని సమాచారం. మొదట ఈ చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని అందమైన పల్లెటూర్లలో తీయాలని ప్లాన్ చేశారట. ఏ దర్శకుడికైనా సాధ్యమైనంత వరకు తమ చిత్రాలను వాస్తవిక లోకేషన్లలో తీయడమే ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్టిఫిషియల్‌గా ఉండే సెట్స్‌లో తీయడం చాలామందికి మరీ ముఖ్యంగా సుక్కు వంటి క్రియేటివ్‌లకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ వాస్తవిక లోకేషన్లలో గోదావరి అందాల నడుమ తీస్తే చరణ్ అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివస్తే ఇబ్బందులు ఏర్పడుతాయని భావిస్తున్నారు. మెగాభిమానులు తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికీ తూర్పు, పశ్చిమగోదావరి వంటి ప్రాంతాలలో మరీ అధికంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర యూనిట్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి చేత పల్లెటూరి సెట్ వేయించి, అక్కడే ఈ చిత్రం షూటింగ్ జరపాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.