రెండేళ్ల కిందట వరకు హీరో శర్వానంద్‌కు నటునిగా మంచి చిత్రాలు చేస్తాడనే పేరున్నప్పటికీ కమర్షియల్ హీరోగా మాత్రం గుర్తింపు లేదు. పదేళ్ల కెరీర్‌లో ఆయన 'రన్ రాజా రన్' చిత్రంతో కమర్షియల్ హీరోగా మారాడు. ఆ తర్వాత ఆయన 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' రూపంలో మంచి చిత్రం చేశాడు. 'ఎక్స్‌ప్రెస్ రాజా'తో మరో హిట్ కొట్టి, తన మార్కెట్‌ను 15కోట్లకు పెంచుకుని కమర్షియల్ హీరోగా ఎదుగుతున్నాడు. దర్శకులుగా ఆయన చిన్న, పెద్దా అనే తేడా చూపించకపోయినా నిర్మాతల విషయంలో మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గత రెండేళ్లలో ఆయన క్రియేటివ్ కమర్షియల్స్, యువి క్రియేషన్స్ వంటి మంచి పేరున్న, సినిమాను బాగా ప్రమోట్ చేయగలిగి, బాగున్న చిత్రాన్ని నిలబెట్టేలా చేసే నిర్మాతలనే ఎంచుకుంటూ వరస హిట్స్ అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన తన 25వ చిత్రాన్ని భారీ నిర్మాతగా పేరున్న బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో చేస్తున్నాడు. ఇక సంక్రాంతి బరిలో ఉంటుందని భావిస్తున్న 'శతమానం భవతి' చిత్రానికి పేరున్న దిల్‌రాజు నిర్మాత. తాజాగా ఆయన యువి క్రియేషన్స్ బేనర్‌లో మూడో చిత్రం చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. ఇక యువి క్రియేషన్స్‌లో మారుతి తీసిన 'భలే భలే మగాడివోయ్' చిత్రం నానిని నేచురల్‌స్టార్‌ని చేసింది. నాని మార్కెట్‌ను 25కోట్లకు చేర్చింది. మరి అదే యువిక్రియేషన్స్ బేనర్‌లో మారుతితో చిత్రం చేయనుండటంతో ఈ చిత్రం తనను కూడా నానిలా స్టార్‌ని చేస్తుందనే ఆశతో ఉన్నాడు శర్వా. మొత్తానికి ఆలస్యంగా అయినా శర్వానంద్ మేల్కొని సినిమా సినిమాకు కమర్షియల్‌గా ఎదుగుతుండటం అభినందనీయం.