టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి రేంజ్ 'బాహుబలి పార్ట్1'తోనే మారిపోయింది. ఇక 'బాహుబలి2' కూడా అదే రేంజ్‌లో హిట్టయితే ఇక రాజమౌళి స్టేజీనే మారిపోతుంది. ప్రస్తుతం అదే పనిలో ఉన్న ఆయన ఈ సెకండ్ పార్ట్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అయితే ఈ చిత్రం తర్వాత ఇక టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్, హాలీవుడ్‌లపైనే రాజమౌళి దృష్టిపెడతారనే పుకార్లు కూడా వచ్చాయి. వాటిని రాజమౌళి కూడా ఖండించాడు. కాగా ప్రస్తుతానికే బాలీవుడ్ స్టార్స్ అమీర్‌ఖాన్‌తో పాటు సల్మాన్, షార్‌ఖ్ వంటి వారు రాజమౌళి దర్శకత్వంలో నటించే ఉద్దేశ్యంలో ఉన్నామంటూ ఆయనకు సంకేతాలు పంపుతున్నారు. దీంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. కాగా కె.ఎల్.నారాయణ నిర్మాతగా దుర్గాఆర్ట్స్ పతాకంపై రాజమౌళి మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయాల్సివుంది. దీనికి సంబంధించి కూడా ఎప్పుడో ఒప్పందం కుదిరింది. దాంతో మహేష్ ఫ్యాన్స్ కొందరు రాజమౌళి టాలీవుడ్‌లో మహేష్‌తో తప్పితే ఇంకెవ్వరితో చిత్రాలు చేయడనే కొత్త ప్రచారం మొదలెట్టారు. ఆయన రేంజ్‌కి ఒక్క మహేష్ అయితేనే సరితూగుతాడని, మిగిలిన హీరోలతో ఆయనకు పనిచేసే ఉద్దేశ్యం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి రాజమౌళి గతంలోనే తన గోల్ 'మహాభారతం' తీయడమేనని, అదే కనుక సాకారమైతే శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్‌ను పెట్టుకుంటానని కూడా చెప్పివున్నాడు. కాగా రాజమౌళి మహేష్‌తో తప్ప మరో తెలుగు హీరోతో చిత్రం చేయడనే వార్తలు రాజమౌళి చెవుల వరకు వెళ్లాయట. దాంతో ఈ ప్రచారంపై ఆయన తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశాడని విశ్వసనీయ సమాచారం. తాను ఎప్పుడు ఏ ఆర్టిస్ట్‌తో కూడా పనిచేయనని చెప్పలేదని, కానీ కొందరు ఇలా అంటూ ఇతర హీరోల వద్ద తనను బ్యాడ్‌గా క్రియేట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడని తెలుస్తోంది.