హీరో మంచు విష్ణు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన కోరిక నెరవేరడం లేదు. మాస్ అండ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఇక ఒక్క హిట్ కూడా లేక హీరోగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన చేసిన కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ 'ఢీ' ఆయనకు మంచి హిట్‌నిచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన కేవలం ఇలా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌నే బేస్ చేసుకొని చేసిన 'దేనికైనా రెడీ, దూసుకెళ్తా' వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాలు చేసే క్రమంలో కూడా ఆయన మరలా మరలా 'రౌడీ', 'అనుక్షణం', 'డైనమైట్' లాంటి చిత్రాలతో మాస్ హీరోగా తన ప్రయత్నాలు ఆపకపోయినా, ఆయనకు విజయం మాత్రం లభించలేదు. తాజాగా ఆయన రాజ్‌తరుణ్‌తో కలిసి చేసిన అడల్ట్ ఎంటర్‌టైనర్ 'ఆడో రకం ఈడో రకం' కూడా ఓ వర్గం ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. దీంతో ఆయన తాజాగా 'లక్కున్నోడు' చిత్రాన్ని కూడా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగానే చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌ను చూసిన వారికి ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఓ లక్కులేని కుర్రాడి చుట్టూ తిరిగే ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందని అనిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఒప్పుకుంటున్నారు. 'గీతాంజలి' వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్‌కిరణ్ డైరెక్షన్‌లో నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తనకు పెద్దగా అవకాశాలు రాకపోయినా సొంత బేనర్‌లోనే సినిమాలు తీస్తూ వస్తున్న ఈ మంచువారబ్బాయి వేరే నిర్మాతతో చాలా కాలం తర్వాత ఈ చిత్రం చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. ఇక జయాపజయాల విషయం పక్కన పెడితే ఎంత పోటీ చిత్రాలు ఉన్నప్పటికీ తమ చిత్రాలను కూడా ఆ పోటీలోనే బరిలో దించడానికి మంచు ఫ్యామిలీ భయపడదు. అదే కోవలో ఈ 'లక్కున్నోడు' చిత్రాన్ని కూడా డిసెంబర్‌లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. రామ్‌చరణ్, సూర్య, నాని-దిల్‌రాజుతో పాటు పలువురు హీరోల చిత్రాలు డిసెంబర్‌లోనే విడుదలకు సిద్దమవుతున్నాయి. అయినా కూడా విష్ణు తన 'లక్కున్నోడు' చిత్రాన్ని కూడా ఇదే పోటీలో బరిలోకి దించాలని నిర్ణయించుకున్నాడట. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాలి...!