సంగీత దర్శకుడు హరీస్‌జైరాజ్ పరిస్థితి టాలీవుడ్‌లో బాగా లేదు. తమిళంలో కూడా ఓకే అనిపిస్తున్నాడే గానీ ఆధిపత్యం సాధించే పరిస్దితుల్లో లేడనేది వాస్తవం. తెలుగులో ఆయన చేసిన చిత్రాలన్నీ పెద్దగా ఆడలేదు. దాంతో ఆయనపై ఐరన్‌లెగ్ అనే ముద్రపడినప్పటికీ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అది మురుగదాస్ చలవే. తెలుగులో హిట్స్ లేకపోయినా ఆయన సంగీతం అందించిన చిత్రాలు మ్యూజికల్‌గా బాగానే ఆకట్టుకున్నాయి. దాంతో తెలుగు సినీ సంగీతాభిమానుల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపే ఉండటంతో ఆయనకు ఈ అవకాశం లభించింది.
ఇక అసలు విషయానికి వస్తే స్టార్‌హీరో సూర్య హీరోగా దర్శకుడు హరి దర్శకత్వంలో 'సింగం3' చిత్రం రూపొందుతోంది. 'గజిని'తో కమర్షియల్ హీరోగా తెలుగులో గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత 'సింగం'(యముడు), 'సింగం2' చిత్రాలతో అటు తమిళంలోనూ. ఇటు తెలుగులోనూ మాస్‌లో గుర్తింపు తెచ్చుకున్న సూర్య పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. ఆయన చేస్తున్న ప్రయోగాలు కమర్షియల్‌గా వర్కౌట్ కావడం లేదు. దాంతో తనకు అచ్చివచ్చిన హరి దర్శకత్వంలో ఆయన 'సింగం3' చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ముందు భాగాలకు తెలుగు సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించి, ఆ చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అయ్యేలా మాస్ ట్యూన్స్‌తోపాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఈ చిత్రాల విజయంలో తెలుగు, తమిళ భాషల్లో కీలకపాత్ర పోషించాడు. మొదట్లో ఈ 'సింగం3'కి కూడా దేవిశ్రీనే సంగీత దర్శకునిగా తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆ స్దానంలో హరీస్‌జైరాజ్‌ను పెట్టుకున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 17న తమిళ, తెలుగుభాషల్లో భారీగా విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కూడా తమిళ, తెలుగు భాషల్లో స్టార్‌ఇమేజ్ ఉన్న అనుష్క, శృతిహాసన్‌లు నటించారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో ఈనెల 27న, తెలుగు వెర్షన్ ఆడియోను డిసెంబర్5న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ చిత్రం ఆడియో మరీ ముఖ్యంగా తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి. ఇక తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ముందు భాగాలకు సంగీతం అందించి, ట్యూన్స్‌పరంగా, బ్య్రాగ్రౌండ్ పరంగా సినిమా ఘనవిజయానికి దోహదపడిన దేవిశ్రీప్రసాద్‌ను మించిన రేంజ్‌లో సంగీతం అందిస్తేనే హరీస్‌పై ఉన్న కొన్ని విమర్శలకు సమాధానం ఇచ్చినట్లు అవుతుంది. అలాగే మహేష్ చిత్రానికి ముందుగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం అందించి ఇరుభాషా ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి వుంది. అలా మహేష్ చిత్రానికి ముందు ఆయన ఫామ్‌లోకి రావడం కీలకంగా మారిందనే చెప్పవచ్చు.