భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న తీసుకున్న 500, 1000 నోట్ల బ్యాన్ డెసిషన్ ఎంత సంచలనాత్మకమైనదో.. ఆరోజు నుండి చిల్లర కోసం నానా తంటాలు పడుతున్న ఎవరిని అడిగినా చెబుతారు. అసలు మోడీ తీసుకుంది సరైన నిర్ణయమేనా? ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని నల్లధనం అంతా నిజంగా బయటికి వస్తుందా? ఒక్క నల్లధనంతోనే భారతదేశం అభివృద్ధి పథంలో ముందంజ వేస్తుందా? నకిలీ నోట్ల ఆట కడుతుందా? మోడీ చేసిన పనికి పేదవాడు, ధనికుడు ఇకపై సమాన హోదా అనుభవిస్తారా..? అనే అనుమానాలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి. అయితే మోడీ తనకి తానుగా తీసుకున్న ఈ డెసిషన్ వల్ల..పై విషయాలు జరుగుతాయో..లేదో చెప్పలేం కానీ, తద్వారా గత 10 రోజులుగా సామాన్యుడు అనుభవిస్తున్న బాధ మాత్రం వర్ణనాతీతం. ఈ పాత నోట్ల మార్పిడి విషయంలో చావు కబుర్లు కూడా వినాల్సి వస్తుందంటే నిజంగా మోడీ సక్సెస్ అయినట్లేనా..? ఈ ప్రశ్నకి బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 100 మంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు..ఒక్క నిర్దోషి కూడా శిక్షించపడకూడదు అనే ఎంతో గౌరవనీయమైన రాజ్యాంగం ఉన్న భారతమాత ఒడిలో బ్రతుకుతున్న ప్రజలకి ఇంతటి హీన స్థితా..! 100 మంది నల్లకుబేరులను బయటికి తెచ్చేందుకు 1000 మంది సామాన్యులు బలికావాలా..? ఇది ఏ చట్టంలో ఉందో మోడీ గారు వివరిస్తే బావుంటుంది.
నిజంగా మీరు తీసుకున్న ఈ నిర్ణయంలో నిజాయితీ ఉంటే.., గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్లు తమ కూతురు పెళ్ళిలో 2వేల నోట్ల కట్టలను ఎలా విరజిమ్మగలిగాడో సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుంది. పెళ్ళికి బిజెపి పెద్దలు వెళ్ళనంత మాత్రాన మీకు ఇది అంటదని అనుకుంటే పొరపాటే. అలాగే ఇదొక స్కాం గా వర్ణిస్తూ..ఆధారాలతో సహా చూపిస్తున్న ఢిల్లీ పెద్ద.. ప్రశ్న పట్ల కూడా మీ నిజాయితిని నిలుపుకోవాల్సి ఉంటుంది. మోడీగారు నిజంగా మీకు భారతదేశాన్ని ఉన్నతస్థాయిలో చూడాలనే ఉద్ధేశ్యమే ఉంటే..ముందు మీరు నిజాయితీగా ఉండాలి. మీ చుట్టూ ప్రక్కల ఉన్నవారు నిజాయితీగా ఉండాలి. రాష్ట్రానికో మాట ఇవ్వడం.. ఆ మాట మీద నిలబడలేకపోవడం కూడా మీపై నమ్మకాన్ని పోగొడుతుంది. నిజంగా మీరు ముందు చూపు ఉన్నవారే అయితే, మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని..కొత్త నోట్లతో ముందుగానే అప్రమత్తం అయ్యిండాలి. అదీ ఎక్కడా జరగలేదు. రోజుకోరకంగా న్యూస్ విడుదల చేస్తూ..ఈ రోజు 4000 వేలు మార్చుకోండి. రేపు 4500, ఆ తర్వాత 2వేలు మాత్రమే అంటూ ఒకరకంగా బ్రిటీష్ పాలనను కొనసాగిస్తున్నారు. ప్రజల పాలిట నియంతలా వ్యవహరిస్తున్నారు. ఇక పాత నోటు మార్చుకుని 2 వేల రూపాయల నోటుతో బ్యాంకులో నుండి బయటపడ్డవాడు..దాన్ని మార్చడానికి పడే నరకయాతన మరీ దౌర్బాగ్యం. ఇదిలా ఉంటే లైనులో నిలబడి ప్రజలు చనిపోతున్నారంటే.. అయ్యో పాపం అనాల్సిందిపోయి..రేషన్ కోసం కొట్టుకోరా..! రేషన్ కోసం చావరా..! బాహుబలి టిక్కెట్ల కోసం ఉదయం 5 గంటల నుండి లైన్లలో నిలబడలేదా..అంటూ..మీ కాంపౌండ్ నుండి వస్తున్న సమాధానాలు..మిమ్మల్ని మరింత దిగజార్చుతున్నాయని ఒక్కసారి తెలుసుకోండి. అయినా నిర్ణయం తీసుకుని..విదేశాలకు వెళ్లిపోయిన మీకు దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఏం తెలుస్తుంది. మీరు కానీ, మీ కాంపౌండ్ మినిస్టర్స్‌గానీ ఒక్కసారి బ్యాంకుల ముందు లైన్‌లో నిలబడితే కదా..తెలిసేది. ప్రజల చావులంటే మీకు పంచ్ డైలాగుల వలే అనిపిస్తున్నట్లుంది.
మీ ఈ నిర్ణయంతో నిజంగా భారతదేశం బాగుపడుతుందని మీరు భావించి ఉండవచ్చుగాక.., కానీ మీరిప్పుడు బయటికి తీస్తున్న నల్లకుబేరులు.. పొగొట్టుకున్న మొత్తాన్ని మళ్లీ ప్రజల్ని పీడించి పొందరని మీరనుకుంటున్నారా! ఒకవేళ మీరు తీసుకునే భవిష్యత్ నిర్ణయాలు అలా ఉన్నా.., మళ్ళీ మీ ప్రభుత్వమే వస్తుందని గ్యారంటీ ఉందా! వచ్చే ప్రభుత్వం మీ నిర్ణయాన్ని అమలు పరుస్తుందనే మీరనుకుంటున్నారా..? నిజంగా ఈ 10, 12 రోజుల్లో మీరు ఎంత అభివృద్ధి సాధించారో తెలియదు కానీ..మీరు కొత్తగా ప్రవేశ పెట్టిన 2 వేల రూపాయల నోటుకి మాత్రం అప్పుడే నకిలీ నోటు మార్కెట్‌లోకి వచ్చినట్లుగా వార్తలైతే విరివిగా వినబడుతున్నాయి. దీన్ని బట్టి మీ నిర్ణయంతో ఏం సాధించారో..ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకుంటే మంచిది.