తెలుగులో 'బిచ్చగాడు'గా వచ్చి సూపర్‌హిట్ అయిన హీరో విజయ్‌ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం 'బేతాళుడు' చిత్రం రిలీజ్ కరెన్సీ మార్పిడి వల్ల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో 'సైతాన్'అనే పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో డిసెంబర్2న విడుదల కానుంది. ఈ చిత్రంపై విజయ్ ఆంటోని బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం కూడా హిట్టయితే ఆయన తెలుగు, తమిళంలో హీరోగా స్దిరపడతానని భావిస్తున్నాడు. కాగా ఈ చిత్రం వాయిదా ఎఫెక్ట్ వల్ల జరిగిన డ్యామేజీని పూడ్చడానికి ఈ చిత్రం యూనిట్ ఓ సంచలన నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం మొదటి పది నిమిషాల చిత్రాన్ని స్వయంగా హీరో విజయ్‌ఆంటోనినే అధికారికంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేయడం చూసి అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈమద్య టెక్నాలజీలో భాగంగా కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు తామే తమ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను లేదా ఫొటోలను లీక్ చేసి, ఆ తర్వాత విడుదలకు ముందే పైరసీకి గురయిందంటూ మీడియాకు ఎక్కి తమ చిత్రాలకు లేని క్రేజ్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో బయటి పైరసీదారులు యూనిట్‌కు తెలియకుండా విడుదలకు ముందే కొన్ని చిత్రాలను లీక్ చేస్తున్నారనేది కూడా వాస్తవమే. గతంలో ఇలాంటి పైరసీరాయుళ్ల లీక్‌ల వల్ల కొన్ని చిత్రాలు లాభపడితే, మరికొన్ని చిత్రాలు ఎంతో నష్టపోయాయి. ఇక పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం కూడా రాష్ట్రంలో సమైక్య ఉద్యమం ఉదృతంగా జరుగుతున్నందు వల్ల విడుదల ఆలస్యమయ్యే సరికి ఈ చిత్రంలోని చాలా భాగం పైరసీదారుల చేతిలో పడి లీక్ అవ్వడం కలకలం రేపింది. దాంతో ఈ చిత్రాన్ని నిర్ణయించిన డేట్ కంటే ముందే థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ చిత్రం పైరసీ కావడం వల్లే తమ చిత్రం కలెక్షన్లు తగ్గాయని, అదే లీక్ కాకుండా ఉంటే ఈ చిత్రం మరింత సంచలన విజయం సాధించి తొలి 100కోట్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించేదని చిత్ర నిర్మాతలే గాక ఆయన అభిమానులు కూడా వాదిస్తుంటారు. అయితే పవన్ వ్యతిరేకులు మాత్రం ఈ చిత్రం విడుదల ఆలస్యం అవుతుండటంతో వారే ఈ చిత్రాన్ని లీక్ చేసి చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ట్రిక్స్ ప్లే చేశారని వాదిస్తుంటారు ఏదిఏమైనా ఇప్పుడు విజయ్‌ఆంటోని పుణ్యమా అని ఇలా లీక్ చేయడానికి కూడా అదికారిక ముద్ర పడింది. మరి భవిష్యత్తులో ఏ చిత్రాన్ని దర్శకనిర్మాతలే లీక్ చేస్తున్నారు? ఏవి పైరసీదారుల చేతుల్లో లీక్ అవుతున్నాయి? అనేది కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతోంది.