పవన్‌కళ్యాణ్ తన సొంత బేనర్ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌లో చేసినవి తక్కువ చిత్రాలే అయినా తాను హీరోగానే ఆ చిత్రాలను తీశాడు. కానీ భవిష్యత్తులో తన బేనర్‌లో అందరూ హీరోలతో చిత్రాలు చేస్తానని, బయటి హీరోలతో కూడా చిత్రాలు చేస్తూ న్యూటాలెంట్‌ను కూడా ప్రోత్సహిస్తానని మాట ఇచ్చాడు. కాగా ఆయన నటించబోయే తొలి చిత్రం అబ్బాయ్ రామ్‌చరణ్‌తోనే చేసే ఉద్ధేశ్యంలో పవన్ ఉన్నాడని ప్రచారం జరిగింది. ఆయన సన్నిహితులతో పాటు అబ్బాయ్ చరణ్ కూడా అదే భావించాడట. కానీ పవన్ ముందుగా తన ఏకలవ్యశిష్యుడు, తనకు వీరాభిమాని అయిన నితిన్‌తో తన సొంత చిత్రం ప్రారంభించాడు. దీంతో మొదటి సినిమాను అబ్బాయ్‌తో చేయాలనే నిర్ణయాన్ని పక్కనపెట్టాడని, ఆయన ఈ విధంగా చరణ్‌ను డిజప్పాయింట్ చేశాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఇతర హీరోలతో కూడా చిత్రాలు చేస్తానని, న్యూటాలెంట్‌ను కూడా ప్రోత్సహిస్తానని చెప్పిన ఆయన మొదటి చిత్రంతోనే తన మాటను నిలుపుకున్నాడు. నితిన్ హీరోగా తన పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నితిన్ సొంత బేనర్ శ్రేష్ట్ మూవీస్‌తో పాటు త్రివిక్రమ్‌ను కూడా భాగస్వామిని చేసుకొని, 'రౌడీఫెల్లో' ఫేమ్ కృష్ణచైతన్యకి అపురూపమైన అవకాశం ఇచ్చి, త్రివిక్రమ్ చేత మూలకథను ఇప్పించి సినిమా ప్రారంభించాడు. దీంతో ఆయన ఇతర హీరోలు, టాలెంటెడ్ టెక్నీషియన్స్‌కు అవకాశం ఇస్తానన్న మాటను నిలబెట్టుకొని ఈ చిత్రం చేస్తున్నాడు. మెగాహీరో అయిన అబ్బాయ్ చరణ్ కంటే పవన్‌కు తన వీరాభిమాని నితినే ముఖ్యమయ్యాడంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏదిఏమైనా చరణ్ డిజప్పాయింట్ అయినా కూడా పవన్ మంచి పని చేశాడనే ప్రశంసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పవన్ వ్యతిరేక వర్గం మాత్రం తన వద్ద ఆఫీస్‌కు అద్దె కట్టడానికి, తన స్టాఫ్‌కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవంటూ మీడియా సాక్షిగా చెప్పాడని, మరి అంతలోనే ఆయనకు నితిన్ చిత్రంలో భాగస్వామిగా మారి సినిమా నిర్మించడానికి డబ్బులు ఎక్కడనుండి వచ్చాయనే విమర్శలను ఆయనపై ఎక్కుపెడుతున్నారు.