బ్లాక్ మనీని, దొంగ నోట్లను నిరోధించడం కోసం మోడి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశంలోని సామాన్యుడి బాధలను కొంతలో కొంతైనా తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలురకాల చర్యలు తీసుకుంటుంది. ప్రతి వ్యక్తి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు గంటల తరబడి నిలుచున్నా తన పనని ముగించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. మోడీ సడన్ గా తీసుకున్న నిర్ణయంతో ఒక్క దెబ్బతో ఏటీఎం లు, బ్యాంకులు ఖాళీ అయిపోతున్నాయి. ఎంత సేపు క్యూలో నిలుచున్నా చివరికి వచ్చేసరికి డబ్బులు ఖాలీ అయిపోతుండటం, నిరుత్సాహంతో వెనుదిరిగి పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కేంద్రప్రభుత్వం వీలైనంత వరకు సమస్యలకు తీర్చేందుకు తగిన ప్రయత్నాలను జరుపుతుంది. పాతనోట్ల మార్పిడి రూ 4500 ఉండటంతో దాన్ని కాస్త కేంద్రం రూ.2 వేలకు కుదించింది. దీని ద్వారా అయినా ప్రతి సామాన్యుడికి పాతనోట్లను మార్చుకొనే అవకాశం దొరుకుతుందన్నది కేంద్రం ఆలోచన.
కాగా తాజాగా కేంద్రప్రభుత్వం సామాన్యుడికి మరో అవకాశం కల్పించింది. పెట్రోల్ బంకుల్లో నగదుని విత్ డ్రా చేసుకొనే సదుపాయాన్ని శుక్రవారం నుండి కల్పించింది. దీంతో బ్యాంకులు, ఏటీఎంలలో నిలబడి ఉండే రద్దీని కొంతైనా తగ్గించవచ్చన్నది కేంద్రం ఆలోచనలో భాగం కావచ్చు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,500 పెట్రోల్ బంకులలోనే ఈ అవకాశం ఉంది. ఆయా పెట్రోల్ బంకులలో ఇప్పటికే స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పిఓఎస్ యంత్రాలను అమర్చింది. ఆ యంత్రాల నుంచి వినియోగదారులు తమ డెబిట్ కార్డు ఉపయోగించి రోజుకు రూ.2000 మొత్తాన్ని తీసుకోవచ్చు. దీంతో కొంతవరకైనా రద్దీని తగ్గించవచ్చని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.