ఏ ముహూర్తాన సమంత హీరోయిన్ అయిందో తెలియదు గానీ, ఆమెను చూసి నేడు అందరూ గర్వపడుతున్నారు... గర్విస్తున్నారు.... గౌరవిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంతను చూసి తాను చాలా గర్విస్తున్నానని చెప్పాడు ఆమెకు కాబోయే భర్త నాగచైతన్య. సోలో హీరోగా తనకసలు యూఎస్‌లో మిలియన్ డాలర్ మూవీనే లేదని, కానీ సమంతకు మాత్రం అక్కడ పదిదాకా మిలియన్ డాలర్ల మూవీలు ఉన్నాయని, ఆమెను మిలియన్ డాలర్ బేబీ అని కూడా అంటున్నారని, 'ఏమాయ చేశావే' నాటికి, నేటికి ఆమె రైజింగ్ చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందని సెలవిచ్చాడు. ఇప్పుడు చైతూ.. సమంతను చూసి గర్వించడానికి మరో పెద్ద రీజన్ కూడా ఉంది. ఆమె ఫాలోయింగ్ విషయంలో తన కాబోయే మామగారైన నాగ్, మరిది అఖిల్‌ను కూడా మించిపోయింది. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో అత్యధిక ఫాలోయర్స్‌ను సాదించుకున్న హీరోలు అఖిల్, నాగ్‌లు. అఖిల్ ఇప్పుడిప్పుడే తన ఫాలోయర్స్‌ను పెంచుకుంటున్నాడు. కానీ తొలి చిత్రం 'అఖిల్' డిజాస్టర్‌తో ఆయన ఫాలోయింగ్ తగ్గింది. అయినా మరలా రైజింగ్‌లోకి వచ్చాడు. ఇక సమంత విషయానికి వస్తే ఆమె నిన్నమొన్నటివరకు తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఫాలోయర్స్‌ను సంపాదించుకుంది. దాంతో ఆమెకు బాగా ఫాలోయర్స్ పెరిగారు. ఆమద్య కొంతకాలం ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా మౌనం పాటించడంతో ఆ సంఖ్య తగ్గింది. కానీ నాగచైతన్యతో నిజజీవితంలో రొమాన్స్ చేస్తూ, త్వరలో చైతూతో పెళ్లిపీటలెక్కి అక్కినేని వంటి గొప్ప వ్యక్తి ఉన్న వంశంలోకి అడుగుపెట్టనుంది. దాంతో ఆమె చైతూని ఉద్దేశించి చేసే కోడ్ భాష, దాని ద్వారా వార్తల్లో నిలవడం, ఇక ఈ పెళ్లికి నాగ్ ఒప్పుకోవడం లేదనే వార్తలు, ఆ తర్వాత ఓకే అన్నాడనే సందేశాలు, పెళ్లి తర్వాత కూడా నటిస్తానని ట్వీట్స్.. అక్కినేని ఫ్యామిలీ కోడలు కాబోతోందనే కీర్తి... ఇలా అక్కినేని ఫ్యామిలిని ఉపయోగించుకొని మరలా తన ఫాలోయర్స్ ను విపరీతంగా పెంచుకుంది. ఇప్పటివరకు సౌత్‌లో అత్యధిక ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన హీరోయిన్ శృతిహాసన్. ఈమె దాదాపు ప్రతి చిన్న విషయాన్ని ట్వీట్ చేస్తూ, రోజూ అప్‌డేట్‌లో ఉండటం మూలంగా ఈమెకు 45లక్షలకు పైగా ఫాలోయర్స్ కలిగి నెంబర్‌వన్ స్దానంలో ఉంది. ఇక రెండో స్దానంలో సినిమాలు చేతిలో లేకపోయినా మంచి ఫాలోయర్స్ త్రిషకు ఉన్నారు. ఈమెకు 29లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ స్దానంలోకి 30లక్షల ఫాలోయర్స్‌లో సమంత చేరి, త్రిషను వెనక్కి నెట్టేసింది. ఇక ఇప్పటి నుండే తాను నాగార్జునకు కాబోయే కోడలిగా పలు వేడుకలకు కూడా వెళ్తున్న ఆమెపై అందర దృష్టి ఉంది. ఇక ఇది సినిమా ఫ్యామిలీ కాబట్టి పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించవచ్చనే మినహాయింపు పొందింది. మొత్తానికి ఐశ్వర్యారాయ్ తర్వాత ఆ అదృష్టం సమంతదే అని చెప్పవచ్చు.