ఒకసారి రాజకీయ రుచి మరిగితే అందులో నుండి బయటకురావడం కష్టం. బుగ్గకారు, రాయితీలు, పరపతి వీటితో పాటు ఆదాయం ఉంటుంది. అందుకే రాజకీయాలు వృత్తిగా తీసుకున్న ఎవరు కూడా రిటైర్ మెంట్ తీసుకోవడానికి ఇష్టపడరు. మన మెగాస్టార్ చిరంజీవి సైతం ఇలాంటి రాజకీయానికి అలవాటు పడినవాడే. కేంద్ర మంత్రిగా ఇండిపెండెంట్ శాఖ నిర్వహించి విదేశాలు చుట్టివచ్చారు. రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. మరో రెండేళ్ళ పదవి ఉంది కాబట్టి అభద్రత లేదు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, యాక్టివ్ గా లేరు. పార్టీ సమావేశాలకు హాజరవడం లేదు. సొంత రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాటాలు జరుగుతుంటే నోరెత్తడం లేదు. తన డేట్స్ కేవలం సినిమాలకే కేటాయించారు. అయితే రాజకీయంగా ఫెయిల్యూర్ అయ్యాడమే అపవాదు పోగొట్టుకోవాలనే ఆలోచన మాత్రం ఉందని సన్నిహితులు అంటున్నారు. తెరమీద హిట్ కొట్టి రాజకీయ జీవితంలో ఓడిపోయాడనే ముద్రను చెరిపేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి పరిష్కారంగా ఆయనకు కొన్ని దార్లున్నాయి. ఒకటి తెదేపా లేదా వైకాపాలో చేరడం. లేదా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేనలో కీలకపాత్ర పోషించడం.
రాష్ట్ర విభజనకు కారమైన కాంగ్రెస్ లో ఉంటే మనుగడ ఉండదు. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మరోసారి రాజ్యసభకు ఎంపికయ్యే ఛాన్స్ చిరంజీవి రాదని స్పష్టమైంది. పొరుగు రాష్ట్రాల్లో అవకాశం రాదు. ఎందుకంటే చిరంజీవి పార్టీకి ఉపయోగపడింది లేదు. పార్టీనే ఆయనకు ఉపయోగపడిందనే విషయం తెలిసిందే. తెదేపాలో చేరితే చంద్రబాబు కింద పనిచేయాలి, ఇక జనసేన తమ్ముడి పార్టీ. వన్ మెన్ ఆర్మీగా ఉన్నపార్టీ. అందులోకి ఆహ్వానించడానికి పవన్ సైతం సుముఖంగా లేరు. ఇలాంటి సంకట స్థితిలో ఉన్న చిరంజీవి మరోసారి తన ప్రజారాజ్యం పార్టీని పునరుజ్జింప జేస్తారా? ఇదీ అనుమానమే.
మరోవైపు ఆయనపై కాపు కుల ముద్ర ధృడంగా పడింది. ఇదీ ప్రమాదమే. కుల పోరాటాలు రాజకీయంగా ఉనికిని తెస్తాయి కానీ, గెలిపించలేవు. సినిమాల్లో విలన్లకు కూడా రాని కష్టాలు రాజకీయంగా మెగాస్టార్ ఎదుర్కొంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం క్రాస్ రోడ్స్ లో నించుని ఉన్నారు. ఎటువైపు వెళ్ళాలనేది సంక్రాంతికి విడుదలయ్యే ఖైదీ సినిమా తెచ్చే ఫలితాన్ని అనుసరించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.