భారత ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చిత్ర పరిశ్రమకు మరో భారీ షాక్ ఎదురైంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్రం నిర్మాతలపై ఐటీ దాడులు జరిగాయి. ఒక్కసారిగా బాహుబలి చిత్రం నిర్మాతల ఇళ్ళు, ఆపీసులలో పెద్ద ఎత్తున ఐటీ సోదాలు నిర్వహించింది. మొత్తం ఐటీ అధికారులు పది బృందాలుగా విడిపోయి అన్ని చోట్లా ఒకేసారి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటివరకు టాలీవుడ్ లో అనుమానం వచ్చిన సమయంలో, ఆ యా నిర్మాతల సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఇటువంటి దాడులు నిర్వహించే ఐటీ శాఖ ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయేలా సినిమా నిర్మాణ సమయంలో ఐటీ దాడులు జరపడం హాట్ టాపిక్ గా మారింది.
కాగా బాహుబలి చిత్రం మొదటి భాగం విడుదలై దాదాపు ఐదారు వందల కోట్లు వసూళ్ళు రాబట్టిన విషయం తెలిసిందే. అయితే అదే విధంగా బాహుబలి2 కూడా ప్రస్తుతం షూటింగ్ ముమ్మరంగా జరుపుకుంటుంది. ఇంకో ఐదారు నెలల్లో బాహుబలి చిత్రం రెండవబాగం విడుదల కానుంది. అయితే ఈ సమయంలో బాహుబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్ళపై, ఆఫీసులపై సోదాలు నిర్వహించడంపై మిగతా నిర్మాతలు కూడా బెంబేలెత్తి పోతున్నారు. కాగా అసలు విషయం ఏంటంటే... బాహుబలి 2 చిత్రం తాలూకూ రైట్స్ అప్పుడే వివిధ ప్రాంతాల వారు బారీ స్థాయిలో కొనుగోలు చేశారని, దాంతో నిర్మాతలకు భారీమొత్తంగా లావాదేవీలు జరిగాయన్న విషయంలో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే బాహుబలి నిర్మాతలపై దాడులతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైందనే చెప్పాలి.