అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరి అంచనాలు తారుమారయ్యాయి. అమెరికాలోని మెజార్జీ ప్రజలు ఊహించని విధంగా ఫలితాలు వెలువడ్డాయి. అన్ని సర్వేలను తలకిందులు చేస్తూ, హిల్లరీ క్లింటన్ ఆశలను, ఒబామా ధీమాను పటాపంచలు చేసేలా ఈసారి జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి 45వ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడు. అమెరికా చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ట్రంఫ్ విజయం ఖరారు కావడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించాడు. ట్రంప్ తన ప్రసంగంలో చాలా హుందాతనాన్ని ప్రదర్శించాడు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థిపై నిరంతరం అవాకులు చవాకులు పేల్చిన ట్రంప్ విజయం వరించాక చాలా సౌమ్యంగా తన మాటలను వ్యక్తపరచడం విశేషం.
కాగా ట్రంప్ మాట్లాడుతూ...మానవులకు గెలుపు ఓటములు చాలా సహజమని, వాటిని ప్రతి ఒక్కరూ పక్కనబెట్టి అమెరికా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరాడు. న్యూయార్క్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటానని, తన విజయానికి దోహదపడిన, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... తమకు లభించిన ఈ బంగారు అవకాశాన్ని అమెరికా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం వినియోగిస్తానని, అమెరికా ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేలా తనకున్న ప్రణాళికతో ముందుకు పోయి అభివృద్ధి కొనసాగిస్తానన్నాడు. ట్రంప్ ఇంకా మాట్లాడుతూ ఇది అంత చారిత్రక విజయమేం కాదు, ముందు ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయంటూ చెప్పి, హిల్లరీ తనకు అభినందనలు తెలిపారని, అలాగే తాను కూడా హిల్లరీని అభినందించానని, ఎన్నికల్లో గెలుపుకోసం హోరాహోరీగా ప్రచారం సాగి ఉత్కంఠకు తెరదీసిందని ఆయన వివరించాడు. మొత్తానికి ట్రంప్ అందరి అంచనాలను తలకిందులు చేసి భలే విజయం దుందుభిని మోగించాడు.
Advertisement
CJ Advs