భాజపాకు అనుబంధ సంస్థగా ఉన్న ఆరెస్సెస్ ఎప్పుడూ దేశం కోసం పోరాడలేదని, అంతేకాకుండా స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిషర్స్ కు తొత్తుగా వ్యవహరించిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. అటువంటి సంస్థ దేశ తొలి ప్రధాని నెహ్రూ గురించి మాట్లాడటమంటే విడ్డూరంగా ఉందని, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పొగడటం కూడా వారి కుత్సిత రాజకీయ బుద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చని వివరించాడు జైపాల్ రెడ్డి. కాగా ఆరెస్సెస్, భాజపాలకు పటేల్ మీద అంత ప్రేమ ఏం లేదని, కేవలం నెహ్రూను తిట్టడం కోసమే ఆయన్ని వాడుకుంటున్నారని తెలిపాడు.
గాంధీభవన్ లో జైపాల్ ఆరెస్సెస్ ను లక్ష్యంగా చేసుకొని భాజపాపై కూడా విరుచుకుపడ్డాడు. ఇంకా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, నెహ్రూపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని వివరించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... అప్పుడు కేబినెట్ లో డాక్టర్ రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, జయప్రకాశ్ నారాయణ, శ్యాంప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. క్విట్ ఇండియా మూమెంట్ లో ‘డూ ఆర్ డై’ పేరుతో చేపట్టిన ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ వర్గాలన్నీ పోరాటంలో పాల్గొంటే ఒక్క ఆరెస్సెస్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించిందని తీవ్రంగా విరుచుకు పడ్డాడు. అంతే కాకుండా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై కూడా జైపాల్ విమర్శలు గుప్పించాడు. గుజరాత్ లో గల్లీలమ్మట తిరిగే లీడర్ అమిత్ షాకు దేశ రాజకీయ చరిత్ర ఏం తెలుసని మాట్లాడుతున్నాడంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. కాంగ్రెస్ దేశం కోసం ఉద్యమాల్లో దూకి, ఏళ్లకి ఏళ్ళు జైళ్లలో మగ్గిందని ఆయన వివరించాడు.