ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రశ్నిస్తానంటూ ప్రకటించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుసగా ఆంధ్రాలోనే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ విషయంలో కూడా పార్టీపరమైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. గతంలో ఎన్నికల ప్రచారంలో తప్ప తెలంగాణాపై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏవిధంగానూ స్పదించని విషయం తెలిసిందే. ప్రస్తుతం జనసేనాని అడుగులు ఒక్కొక్కటిగా ముందుకు పడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు జనసేన పార్టీ ఇంచార్జిలను కానీ, పార్టీపరంగా ఇంతవరకు ఏరకమైన అధికార ప్రతినిధులను కానీ నియమించలేదన్న విషయం తెలిసిందే. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున తెలంగాణకు ఇంచార్జ్ లను నియమించి అందరికి షాక్ కు గురిచేశాడు.
కాగా ఈ మధ్య కాలంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నా.... ఎటువంటి ఇంచార్జులనుగానీ, అధికార ప్రతినిధులను గానీ ఇప్పటివరకు నియమించడం జరగలేదు. కాగా తెలంగాణలో కూడా తమ జనసేన పార్టీ ఉందంటూ.. పవన్ ఆ పార్టీకి సంబంధించి ప్రతినిధులను నియమించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమందికి పార్టీ పరమైన కీలక బాధ్యతలను అప్పగించాడు. కాగా వారిలో మహేందర్ రెడ్డి, హరిప్రసాద్, శంకర్ గౌడ్ లు ఉన్నారు. అయితే వీరిలో మహేందర్ రెడ్డి, శంకర్ లు ఇంతకు ముందే పవన్ స్థాపించిన కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్ లో పని చేశారు. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ పరంగా మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమన్వయ కర్తగా నియమిస్తూ పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా వారిలో హరిప్రసాద్ ను మీడియా ప్రతినిధిగా నియమించగా, శంకర్ గౌడ్ ను జనసేన పార్టీ ఇంచార్జి గా నియమించడం జరిగిందని పవన్ కళ్యాణ్ వెల్లడించాడు.