తెలంగాణ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడానికి కటాఫ్ డేట్ పెట్టుకుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటుగా మల్లన్న సాగర్, కాళేశ్వరం, మానేరు ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి నీళ్ళిస్తామని ప్రకటించింది. అనుకున్న టైమ్‌లో పూర్తిచేయకపోతే అధికారులను బాధ్యులను చేస్తామని చెప్పింది. ఇది హర్షించదగిన పరిణామమే. అయితే ఇదే స్పీడ్ హైదరాబాద్ మెట్రోపై చూపించడం లేదు. కాంగ్రెస్ హయంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ నత్తనడకన సాగుతోంది. దాంతో నగర ప్రజలు ట్రాఫిక్‌లో నరకయాతన పడుతున్నారు. మీడియా ద్వారా పౌరుల కష్టాలు తెలుస్తున్నా ప్రభుత్వం కదలడం లేదు. ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నప్పటికీ పాలకుల్లో చలనం లేదు. పైగా హైదరాబాద్ పాలన కూడా తెరాస చేతిలోనే ఉంది. మొన్నటి వర్షానికి ప్రత్యక్ష నరకాన్ని చూపిన పాలకులు మెట్రోపై మాత్రం దాటవేస్తున్నారు. ఎల్ అండ్ టీ వంటి ప్రతిష్టాత్మక సంస్థ మెట్రో నిర్మాణాన్ని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేసి, సమయానికి పూర్తి చేసిన ఘనతవారిది. అలాంటి సంస్థ కూడా పాలకుల నిర్లక్షం కారణంగా చేతులెత్తేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే 2019 ఎన్నికల్లో మెట్రో రైలు ఎన్నికల నినాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
వాస్తు పేరుతో నెలల్లోనే తన ఇంటిని నిర్మించుకున్న కేసీఆర్ గారు ప్రజలకు అవసరమైన మెట్రోను మాత్రం పక్కన పెట్టేయడం విశేషం.