తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి పెంచిన చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రంతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయి కీర్తిని పొందింది. దిగ్దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వసూళ్ళ విషయంలో కూడా ఈ చిత్రం తెలుగులో నూతన చరిత్ర ఆవిష్కరించింది. అలాంటి సినిమా బాహుబలికి ఘోర అవమానం జరిగినట్లుగా భావిస్తున్నారు సినీవర్గాలు. అందుకు కారణం ఏంటంటే... ఈ మధ్య అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా 2016 సంవత్సరానికి గాను నామినేషన్స్ జరిగాయి. ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించడం కోసం మొత్తం 22 సినిమాలను ఎంపిక చేసారు. బాలీవుడ్ నుండి ‘సుల్తాన్’, ‘బాజీరావు మస్తానీ’, ‘ఎయిర్ లిఫ్ట్’ వంటి చిత్రాలు అవకాశం దక్కించుకొనేందుకు లైన్ లో ఉండగా, అన్ని రికార్డులను సొంతం చేసుకున్న తెలుగు చిత్రం ‘బాహుబలి’ కనీసం ఆ జాబితాలో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అన్ని రకాలుగా, అంత గొప్ప పేరు తెచ్చుకున్న ‘బాహుబలి’ చిత్రం ఈ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపిక కాకపోవడంతో ‘బాహుబలి’ చిత్రానికి నిజంగా అవమానం జరిగినట్లుగానే భావిస్తున్నారు సినీజనం. అంతే కాకుండా సినిమా అవార్డుల ఫెస్టివల్ లో అయిన అందులో ఒక్క తెలుగు చిత్రం కూడా కనీసం ప్రదర్శనకు అవకాశం దక్కించుకోకపోవడం ఎంతైనా శోచనీయం. నిజంగా ఈ విషయంలో తెలుగు సినిమాకు జరుగుతుంది అన్యాయమా? లేక అవమానమా? అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కాగా ఏది ఏమైనప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతటి ఘనకీర్తి సాధించిన బాహుబలి చిత్రం కనీసం ప్రదర్శనకు నోచుకోకపోవడం బాధాకరం.